Galwan martyr Father Attack: ఇదేం నిర్వాకం? నితీష్‌కు రాజ్‌నాథ్ ఫోన్

ABN , First Publish Date - 2023-03-01T16:20:29+05:30 IST

రెండేళ్ల క్రితం గల్వాన్ ఘర్షణలో, దేశ రక్షణలో నేలకొరిగిన అమర జవాన్ జై కిశోర్ సింగ్‌ స్మారకం విషయంలో ఆయన తండ్రి రాజ్‌కపూర్ సింగ్‌పై ..

Galwan martyr Father Attack: ఇదేం నిర్వాకం? నితీష్‌కు రాజ్‌నాథ్ ఫోన్

న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం గల్వాన్ ఘర్షణలో, దేశ రక్షణలో నేలకొరిగిన అమర జవాన్ జై కిశోర్ సింగ్‌ స్మారకం విషయంలో ఆయన తండ్రి రాజ్‌కపూర్ సింగ్‌పై బీహార్ పోలీసులు దురుసుగా ప్రవర్తించిన ఘటనను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్రంగా ఖండించారు. రాజ్‌కపూర్ సింగ్‌ను అరెస్టు చేయడానికి ముందు పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరుపై బుధవారంనాడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు ఫోన్ చేసి ఈ మొత్తం వ్యవహారం ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఘటన వివరాలు..

బీహార్‌లోని కజ్రి బుజుర్గ్‌లో రాజ్‌కపూర్ సింగ్ తన కుమారుడికి ఇటీవల ఒక స్మారకం నిర్మించారు. దీనిపై హరినాథ్ అనే పొరుగింటి వ్యక్తి అభ్యంతరం తెలిపారు. ఈ వివాదం పోలీసులకు వెళ్లింది. ఈ నేపథ్యంలో గత శనివారం రాత్రి పోలీసులు రాజ్‌కపూర్ సింగ్‌ను అరెస్టు చేసి, ఈడ్చుకుంటూ వెళ్లారు. 15 రోజుల్లో స్మారకాన్ని కూల్చేయాలంటూ డెడ్‌లైన్ విధించారు. ఈ ఘటనను ఆర్మీలోనే పనిచేస్తున్ జై కిషోర్ సింగ్ సోదరుడు నంద్‌ కిషోర్ ఖండించారు. డీజీపీ మేడం తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లోగా విగ్రహాన్ని తొలగించాలని చెప్పారని, తగిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని తెలియజేశామని అన్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి తమ ఇంటికి వచ్చి తన తండ్రిని అరెస్టు చేశారని, అరెస్టుకు ముందు ఆయనను దూషిస్తూ, చేయి చేసుకున్నారని ఆరోపించారు. పోలీసు చర్యకు నిరసనగా స్థానికులు సైతం ఆందోళనకు దిగారు. అయితే, రాజ్‌కపూర్ సింగ్ కుటుంబ సభ్యుల వాదనను పోలీసులు తోసిపుచ్చారు. హరినాథ్ రామ్ అనే వ్యక్తికి, ప్రభుత్వానికి చెందిన స్థలంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై ఎస్సీ-ఎస్టీ చట్టం కింద జనవరి 23న కేసు నమోదైందని, ఆ తర్వాత విగ్రహం చుట్టూ గోడలు లేపారని, ఇందుకోసం తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఒకవేళ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని వారనుకుంటే సొంత భూమిలో ఏర్పాటు చేసుకుని ఉండవచ్చని, లేదంటే స్థలం కావాలని ప్రభుత్వాన్ని కోరవచ్చనీ, భూ ఆక్రమణ ద్వారా ల్యాండ్ఓనర్ హక్కులను వాళ్లు ఉల్లంఘించారని సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

విచారణకు ఆదేశించిన డీజీపీ

అమర జవాను జైకిషోర్ సింగ్ తండ్రిని అరెస్టు చేసిన తీరుపై తక్షణ విచారణకు బీహార్ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. అమరవీరుని సోదరుడు చేసిన ఆరోపణలపై ఎంక్వయిరీ చేయాలని జీడీపీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ మొత్తం ఘటనలో పోలీసు అధికారి కానీ, సిబ్బంది కానీ దోషిగా తేలితే తగిన చర్యలు తీసుకుంటామని బీహార్ పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-03-01T23:28:29+05:30 IST