Karnataka Elections: ఒకేరోజు కోలార్‌లో రాహుల్, మైసురులో మోదీ

ABN , First Publish Date - 2023-04-01T15:00:20+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. ఇటు రాహుల్ గాంధీ, అటు ప్రధాన నరేంద్ర మోదీ ఒకోరోజు...

Karnataka Elections: ఒకేరోజు కోలార్‌లో రాహుల్, మైసురులో మోదీ

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. లోక్‌సభ సభ్యత్వంపై వేటుపడిన తర్వాత తొలిసారి కర్ణాటకలోని కోలార్‌ (Kolar)లో జరిగే ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఆసక్తికరంగా 2019 ఎన్నికల్లో ఇదే కోలార్ నుంచి రాహుల్ చేసిన వ్యాఖ్యల కేసులోనే ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఆ క్రమలోనే ఆయన లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడటం వంటి వరుస పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈనెల 9న కోలార్‌లో జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ పాల్గొననుండగా, ఇదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం కర్ణాటకలో పర్యటించనున్నారు.

రాహుల్‌పై పడిన అనర్హత వేటును రాజకీయ అంశంగా కాంగ్రెస్ మార్చుకోవాలనుకుంటోందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో కర్ణాటకలో రాహుల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంటోంది. 9వ తేదీన కోలార్ సభలో రాహుల్ పాల్గొనడంతో పాటు, ఈనెల 11న కేరళలోని వయనాడ్‌‌లో ఆయన పర్యటించనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ట్వీట్‌లో తెలిపారు. 9న కోలార్‌లో జరిగే భారత్ మెగా ర్యాలీలో రాహుల్ పాల్గొంటారని, 11న వయనాడ్ వెళ్తారని చెప్పారు. ప్రజావాణిని రాహుల్ తన ప్రచారసభలో వినిపిస్తారని, ఆయన వాణిని ఎవరూ అణిచివేయలేరని వేణుగోపాల్ పేర్కొన్నారు.

టైగర్ ప్రాజెక్ట్‌ కార్యక్రమంలో మోదీ...

మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈనెల 9న కర్ణాటకలో పర్యటించనున్నారు. టైగర్ ప్రాజెక్ట్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మైసూరు, చామరాజనగర్‌ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మూడు రోజుల కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. బండిపుర టైగర్ రిజర్వ్‌లో ఆయన సఫారీ టూర్ కూడా చేపట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలతోనూ మోదీ సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా, మే 13న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

Updated Date - 2023-04-01T15:00:47+05:30 IST