Raghav Chadha: రాజ్యసభ నుంచి రాఘవ్ చద్దా సస్పెండ్

ABN , First Publish Date - 2023-08-11T18:21:02+05:30 IST

ఐదుగురు రాజ్యసభ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రివిలేజ్ కమిటీ ఈ అంశంపై నివేదిక సమర్పించేంత వరకూ ఆయనను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ శుక్రవారంనాడు ప్రకటించారు.

Raghav Chadha: రాజ్యసభ నుంచి రాఘవ్ చద్దా సస్పెండ్

న్యూఢిల్లీ: ఐదుగురు రాజ్యసభ (Rajya Sabha) సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha)పై సస్పెన్షన్ వేటు పడింది. రాఘవ్ చద్దా చర్య అనైతికమని, ఆయనను సస్పెండ్ చేయాలని రాజ్యసభ నేత పీయూష్ గోయెల్ శుక్రవారంనాడు ఒక తీర్మానాన్ని సభ ముందుకు తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ ఈ అంశంపై నివేదిక సమర్పించేంత వరకూ ఆయనను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ (Jagdeep Dhnakhar) ప్రకటించారు. ఆప్ మరో ఎంపీ సంజయ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకునేంతవరకూ ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు.


రాఘవ్ చద్దా ప్రతిపాదించిన సెలక్ట్ కమిటీ తీర్మానంపై ఉన్న సంతకాలు తమవి కావని బీజేపీ ఎంపీలు ఎస్‌ ఫాంగ్నోన్ కొన్యాక్, నరహరి అమీన్, సుదాన్షు త్రివేది, అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర ఇటీవల జగదీ‌ప్ ధన్‌కర్‌కు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండానే పేర్లు ఇందులో చేర్చారని, తమ సంతకాలు ఫోర్జరీ చేశారని, తమ హక్కులకు భంగం కలిగిందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.


ప్రశ్నించినందుకే వేటు: రాఘవ్ చద్దా

రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడంపై రాఘవ్ చద్దా ఘాటుగా స్పందించారు. ''నన్నెందుకు సస్పెండ్ చేశారు? నేను చేసిన నేరం ఏమిటి? అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ప్రశ్నించడం వల్లే సస్పెండ్ చేశారా? ఢిల్లీ సర్వీసుల బిల్లుపై బీజేపీ నుంచి న్యాయం చేయమని కోరుతూ తన వాదన వినిపించడమే నేరమైందా?'' అని ఆయన ప్రశ్నించారు. ఈవారం తనకు ప్రివిలేజ్ కమిటీ నుంచి రెండు నోటీసులు వచ్చాయని, దీనిపై పార్లమెంటులో మాట్లాడేందుకు తనను అనుమతించలేదని అన్నారు. సంకతాలు ఫోర్జరీ చేసినట్టు బీజేపీ తనపై ఆరోపణలు చేస్తోందని, నిజానికి ఏదైనా ఒక కమిటీని వేయమని ఏ ఎంపీ అయినా ప్రతిపాదించవచచని, ఇందుకు లిఖిత పూర్వక అనమతి కానీ, సంతకాల అవసరం కానీ లేదని చద్దా చెప్పారు.

Updated Date - 2023-08-11T18:21:02+05:30 IST