BJP : బీజేపీ ఇక ఎంత మాత్రం రాజకీయ ఉద్యమం కాదు : మోదీ

ABN , First Publish Date - 2023-01-17T20:34:44+05:30 IST

భారత దేశపు అత్యుత్తమ శకం రాబోతోందని, ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం అంకితమవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

BJP : బీజేపీ ఇక ఎంత మాత్రం రాజకీయ ఉద్యమం కాదు : మోదీ
Narendra Modi, JP Nadda

న్యూఢిల్లీ : భారత దేశపు అత్యుత్తమ శకం రాబోతోందని, ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం అంకితమవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పిలుపునిచ్చారు. బీజేపీ ఇక ఎంతమాత్రం రాజకీయ ఉద్యమం కాదని, అది సాంఘికోద్యమం కూడానని చెప్పారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మంగళవారం ఆయన మాట్లాడారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా (Jagat Prakash Nadda)ను 2024 జూన్ వరకు ఆ పదవిలో కొనసాగిస్తూ మంగళవారం ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించారు. దేశం నలుమూలల నుంచి సుమారు 350 మంది నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. మోదీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ ఏడాదిలో 9 రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఏడాది మే నెలలోగా లోక్‌సభ ఎన్నికలు జరగవలసి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని నడిపే బాధ్యతలను మళ్లీ నడ్డాకే అప్పగించారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలను తెలిపారు. భారత దేశానికి ఇది చాలా ఉత్తమమైన సమయమని, దేశాభివృద్ధి కోసం మనమంతా తప్పనిసరిగా గొప్ప కృషి చేయాలని ప్రధాని మోదీ చెప్పారని తెలిపారు. అమృత కాలం కర్తవ్య కాలంగా మారాలని, అప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తుందని చెప్పారన్నారు.

‘‘ప్రస్తుతం 18-25 సంవత్సరాల మధ్య వయస్కులు గత ప్రభుత్వాల తప్పుడు పరిపాలనను చూడలేదు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో భారత దేశం ఆ తప్పుడు పరిపాలన నుంచి సుపరిపాలనకు ఏవిధంగా మారిందో వారు చూడలేదు, కాబట్టి యువతకు దీనిపై తప్పకుండా అవగాహన కల్పించాలి. రాబోయే రోజుల్లో ఈ పనిని బీజేపీ చేస్తుంది’’ అని మోదీ అన్నారని ఫడ్నవీస్ చెప్పారు.

ప్రజలకు చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని తమకు చెప్పారని తెలిపారు. ముఖ్యంగా సరిహద్దుల్లోని గ్రామాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించి, అక్కడి ప్రజలతో మరింత మమేకమవాలని చెప్పారన్నారు. ఆయా గ్రామాల ప్రజలతో మరింత అనుబంధం ఏర్పరచుకోవడానికి, ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వారికి చేర్చడానికి దోహదపడేవిధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పినట్లు తెలిపారు.

‘‘సమాజంలో ప్రతి వర్గానికి చేరువకండి. ఎన్నికలతో పని లేకుండా బోహ్రాలు, పాస్మాండాలు, సిక్కులు వంటి మైనారిటీలకు చేరువకండి. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మనం ప్రయత్నించాలి. ఈ పనులను ఓటు బ్యాంకు కోసం చేయకూడదు. అందరి కోసం పని చేయాలన్నదే మన ఉద్దేశం అయి ఉండాలి’’ అని మోదీ చెప్పారన్నారు. మోదీ ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా గొప్ప వక్తగా, పెద్ద మనిషి తరహాలో మాట్లాడారని చెప్పారు. పార్టీ కన్నా దేశానికి పెద్ద పీట వేస్తూ మాట్లాడారని తెలిపారు.

‘‘రసాయనాలు, ఎరువులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం, ఇంధన పరివర్తన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా బీజేపీ పని చేయాలి’’ అని మోదీ చెప్పినట్లు దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

‘‘ఒక భారత దేశం, శ్రేష్ఠ భారత దేశం’’ నినాదాన్ని మోదీ పునరుద్ఘాటించినట్లు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలని, ఒక రాష్ట్ర సంస్కృతి, భాష, సంప్రదాయాలను మరొక రాష్ట్రం అంగీకరించాలని తెలిపారు. వారణాసిలో నిర్వహించిన తమిళ సంగమాన్ని దీనికి ఉదాహరణగా చెప్పారని తెలిపారు.

పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు వివిధ జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలు పాల్గొనాలని మోదీ చెప్పారన్నారు.

Updated Date - 2023-01-17T20:34:55+05:30 IST