Chandrayaan-3 : చంద్రయాన్-3 విజయోత్సవాలు.. ఇస్రో శాస్త్రవేత్తల సమక్షంలో మోదీ భావోద్వేగం..

ABN , First Publish Date - 2023-08-26T08:45:27+05:30 IST

చంద్రయాన్-3ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసల్లో ముంచెత్తారు. గతంలో ఎవరూ సాధించని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారని చెప్పారు.

Chandrayaan-3 : చంద్రయాన్-3 విజయోత్సవాలు.. ఇస్రో శాస్త్రవేత్తల సమక్షంలో మోదీ భావోద్వేగం..
Narendra Modi

బెంగళూరు : చంద్రయాన్-3ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసల్లో ముంచెత్తారు. గతంలో ఎవరూ సాధించని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం దూసుకెళ్తోందని చెప్పారు. మన దేశం ప్రపంచానికి దిక్సూచిగా మారిందన్నారు. చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల సమక్షంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన నుంచి వచ్చిన మోదీ నేరుగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన దేశం ప్రపంచానికి వెలుగులు విరజిమ్ముతోందన్నారు. సృష్టికి ఆధారం నారీశక్తి అని తెలిపారు. చంద్రయాన్-3లో మహిళలు తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. చంద్రయాన్-3 కోసం మహిళలు చేసిన కృషి ప్రశంసనీయమని చెప్పారు. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని మనం నిరూపించామని తెలిపారు.

బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడం కోసం తాను దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నప్పటికీ, తన మనసంతా చంద్రయాన్-3పైనే ఉందని తెలిపారు. ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణమని తెలిపారు. ఈ విజయం అసాధారణమైనదని, అంతరిక్ష చరిత్రలో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించిందని తెలిపారు. విజ్ఞానాన్ని మానవ కల్యాణం కోసం వినియోగించాలన్నారు. ‘‘మీ వైజ్ఞానిక సేవలకు గౌరవ వందనం చేస్తున్నాను’’ అని మోదీ చెప్పారు.


ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఇంటింటికీ జాతీయ జెండా కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ, ప్రతి ఇంటిపైన మాత్రమే కాదు, చంద్రునిపైన కూడా మన జాతీయ జెండా ఎగురుతోందన్నారు. చంద్రయాన్-2 వైఫల్యంతో మనం వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజ్ఞాన్ రోవర్ శంఖనాదం చేసిందన్నారు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేశారు. చంద్రయాన్-2 కూలిపోయిన ప్రదేశానికి తిరంగా అని నామకరణం చేశారు.

చంద్రయాన్-3 చంద్రునిపై దిగిన సమయంలో తాను దక్షిణాఫ్రికాలో ఉన్నానని చెప్పారు. ఆ మధుర క్షణాలను జొహన్నెస్‌బర్గ్‌ నుంచి చూశానని చెప్పారు. విదేశీ పర్యటన నుంచి రాగానే మిమ్మల్ని కలవాలనుకున్నానని ఇస్రో సిబ్బంది, శాస్త్రవేత్తలను ఉద్దేశించి చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందన్నారు. శాస్త్రవేత్తలను అభినందిస్తూ మోదీ భావోద్వేగానికి గురయ్యారు. వారికి గౌరవ వందనం చేశారు. కొత్త ఆలోచనలను మరింత సరికొత్తగా ఆలోచించే సత్తా మనకు ఉందన్నారు. సైన్స్‌ను ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించుకునేందుకు ‘శివశక్తి’ స్థానం రానున్న తరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే మనకు అత్యంత ముఖ్యమైనదని తెలిపారు.

జాతీయ అంతరిక్ష దినోత్సవాలు

చంద్రునిపైన విక్రమ్ ల్యాండర్ సున్నితంగా దిగిన రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవాలుగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.

యువత కోసం స్పేస్ హ్యాకథాన్

యువత కోసం ‘స్పేస్ హ్యాకథాన్’ను నిర్వహించాలని ఇస్రోను కోరారు. ‘‘నేడు బాలబాలికలంతా తమ భవిష్యత్తును మీలో చూసుకుంటున్నారు. యువతకు మీరు ఓ మార్గాన్ని చూపించారు. మీరు సాధించిన విజయం కేవలం చంద్రయాన్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మీరు ప్రేరణ, శక్తి ప్రభంజనాన్ని వ్యాపింపజేశారు’’ అని ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ చెప్పారు.

‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రోత్సాహం

‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రునిపైకి తీసుకెళ్లారని ప్రశంసించారు. చంద్రయాన్-3 విజయవంతమవడంతో దేశీయ ఉత్పత్తులకు, పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని నిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆదిత్య ఎల్1, గగన్‌‌యాన్‌ల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. చంద్రయాన్-3 విజయవంతమైన వెంటనే మోదీ మాట్లాడినపుడు కూడా ఈ విజయం యావత్తు మానవాళిదని చెప్పిన సంగతి తెలిసిందే.

మోదీ దక్షిణాఫ్రికా నుంచి నేరుగా బెంగుళూరుకు వచ్చారు. బెంగుళూరు విమానాశ్రయంలో మోదీకి కర్ణాటక సీఎస్‌, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల ఉన్న ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసించారు. HAL నుంచి రోడ్డు మార్గంలో పీణ్యాలోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి మోదీ చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో జాతీయ జెండాలతో ప్రజలు బారులు తీరి ఆయనకు స్వాగతం పలికారు. హెచ్ఏఎల్ నుంచి ఇస్రోకు వెళ్లే 30 కిలోమీటర్ల మార్గంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందిని చూసిన వెంటనే కరతాళ ధ్వనులతో వారిని మోదీ అభినందించారు.


ఇవి కూడా చదవండి :

High Court: నటి చిత్ర కేసును 6 వారాల్లో పూర్తి చేయండి

Chennai: ఒకటో తరగతికి కనీస వయస్సు ఐదేళ్లు

Updated Date - 2023-08-26T09:10:54+05:30 IST