Plane Crash: అమెజాన్ అడవుల్లో కుప్పకూలిన విమానం.. మృతుల సంఖ్య ఎంతంటే..

ABN , First Publish Date - 2023-09-17T09:12:01+05:30 IST

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం (Plane crashed) జరిగింది. బ్రెజిలియన్ అమెజాన్ అడవుల్లో పాపులర్ టూరిస్ట్ టౌన్ ‘బార్సెలోస్’లో ప్రతికూల వాతావరణంలో ల్యాండింగ్‌ ప్రయత్నించి ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారందరూ చనిపోయారని అధికారులు వెల్లడించారు.

Plane Crash: అమెజాన్ అడవుల్లో కుప్పకూలిన విమానం.. మృతుల సంఖ్య ఎంతంటే..

రియో డీ జనీరో : బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం (Plane crashed) జరిగింది. బ్రెజిలియన్ అమెజాన్ అడవుల్లో పాపులర్ టూరిస్ట్ టౌన్ ‘బార్సెలోస్’లో ప్రతికూల వాతావరణంలో ల్యాండింగ్‌ ప్రయత్నించిన ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారందరూ చనిపోయారని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన విమానం భారీ వర్షం మధ్య బార్సిలోస్ పట్టణం చేరుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా సరిగా కనిపించే పరిస్థితి లేకపోవడంతో పైలెట్ విమానం ల్యాండింగ్‌ను రన్‌వే మధ్యలో మొదలుపెట్టడం ఈ దుర్ఘటనకు దారితీసిందని అమెజాన్ స్టేట్ సెక్యూరిటీ సెక్రటరీ వినిసస్ అల్మేడియా తెలిపారు. విమానం రన్‌వే స్ట్రిప్ దాటి ఇంకా ముందుకువెళ్లి కుప్పకూలిందని, 12 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు సిబ్బంది కన్నుమూశారని అధికారి వివరించారు.


ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విమానంలోని ప్రయాణికులంతా బ్రెజిల్‌ పౌరులేనని తెలుస్తోంది. అందరూ పురుషులేనని, వారంతా స్పోర్ట్ ఫిషింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చారని అధికారిక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. విమానం కుప్పకూలిన మరుక్షణం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అక్కడి గవర్నర్ విల్సన్ లిమా ఎక్స్ (గతంలో ట్విటర్) వేదికగా వెల్లడించారు.

మీడియా కథనాల ప్రకారం.. చిన్న విమానం ప్రతికూల వాతావరణంలో చిత్తడిగా ఉన్న రన్‌వేపై ల్యాండయ్యింది. రన్‌వే దాటి పొదల్లో దూసుకెళ్లిందని చెబుతున్నాయి. మృతుల్లో అమెరికన్ పౌరులు కూడా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రాథమిక దర్యాప్తులో బ్రెజిల్ పౌరులు మాత్రమే ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-09-17T09:14:05+05:30 IST