Share News

Piyush Goyal: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. శరద్ పవార్‌పై పీయూష్ గోయల్ ‘కుళ్లిన’ విమర్శలు

ABN , First Publish Date - 2023-10-18T21:46:42+05:30 IST

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ), ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల మీద కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో...

Piyush Goyal: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. శరద్ పవార్‌పై పీయూష్ గోయల్ ‘కుళ్లిన’ విమర్శలు

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ), ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల మీద కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ మంత్రిగా పని చేసిన శరద్ పవార్ తీవ్రవాదానికి సంబంధించిన విషయంలో అంత క్యాజువల్‌గా ఎలా వ్యవహరిస్తారని.. ఈ కుళ్లిన మనస్తత్వానికి స్వస్తి పలకాలని అన్నారు. అంతేకాదు.. ఇప్పుడైనా దేశం గురించి ఆలోచించాలని హితవు పలికారు.

అసలు శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలేంటి?

ఇటీవల ముంబైలోని ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో శరద్ పవార్ పాలస్తీనాకు మద్దతు తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ప్రపంచ శాంతికి ముప్పు అని పేర్కొన్నారు. అక్కడి భూమి, ఇళ్లు అన్నీ పాలస్తీనాకు చెందినవని.. వాటిని ఇజ్రాయెల్ ఆక్రమించిందని చెప్పారు. పాలస్తీనాకు సహాయం చేయడంలో దేశ మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్ర ఉందని గుర్తు చేశారు. కానీ.. ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం దురదృష్టవశాత్తు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చి, భారత మూలాల్ని వ్యతిరేకించారని వ్యాఖ్యానించారు. గత నాయకుల వైఖరి, శ్రామిక ప్రజలకు అనుకూలంగా తమ ఎన్సీపీ పార్టీ ఉందని శరద్ పవార్ స్పష్టం చేశారు.


ఇందుకు పీయూష్ గోయల్ ఇచ్చిన కౌంటర్ ఏంటి?

‘‘శరద్ పవార్ వంటి ఎంతో అనుభవం కలిగిన సీనియర్ నాయకులు.. ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద దాడిపై భారతదేశపు వైఖరికి సంబంధించి అసంబద్ధ ప్రకటనలు చేయడం చాలా కలవరపెడుతోంది. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాద ముప్పుని అన్ని రకాలుగా ఖండించాలి. ఒకప్పుడు దేశ రక్షణ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పలుమార్లు పనిచేసిన వ్యక్తి.. తీవ్రవాదానికి సంబంధించిన విషయాల్లో ఇంత క్యాజువల్‌గా వ్యవహరించడం శోచనీయం. గతంలో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ప్రభుత్వంలో శరద్ పవార్ కూడా ఒక భాగమే. భారత గడ్డపై దాడి జరిగినప్పుడు వాళ్లు నిద్రస్తూనే ఉన్నారు. ఈ కుళ్ళిన మనస్తత్వానికి స్వస్తి పలకాలి. శరద్ పవార్ కనీసం ఇప్పుడైనా దేశం గురించి ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా బదులిచ్చారు.

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంపై మోదీ ప్రకటన ఏంటి?

అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ 5వేల రాకెట్లతో మెరుపుదాడి చేసిన కొన్ని గంటల్లోనే.. ట్విటర్ మాధ్యమంగా ప్రధాని మోదీ ఈ దాడిని ఖండించారు. దీనిని ఉగ్రదాడిగా పేర్కొన్న ఆయన.. ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తామని అన్నారు. అంతేకాదు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతోనూ ఫోన్‌లో మాట్లాడారు. తాము అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని చెప్పి, ఆయనకు భరోసా కల్పించారు.

Updated Date - 2023-10-18T21:46:42+05:30 IST