Rahul Gandhi: మోదీ ప్రసంగం సంతృప్తిగా లేదు, అదానీని ఆయనే కాపాడుతున్నారు..

ABN , First Publish Date - 2023-02-08T19:19:41+05:30 IST

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో సమాధానమిస్తూ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...

Rahul Gandhi: మోదీ ప్రసంగం సంతృప్తిగా లేదు, అదానీని ఆయనే కాపాడుతున్నారు..

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) లోక్‌సభలో సమాధానమిస్తూ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పెదవి విరిచారు. గౌతమ్ అదానీపై దర్యాప్తునకు ఎలాంటి చర్యలు ప్రారంభించకుండా మోదీ ఆయనను కాపాడుతున్నారని అన్నారు. పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగం అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, అదానీ కుంభకోణాల అంశాన్ని అనేక మంది సభ్యులు సభలో లేవనెత్తినా ప్రధాని మాత్రం ఎక్కడా ఆ ప్రస్తావన చేయకుండా మౌనాన్నే ఆశ్రయించారని అన్నారు. ప్రధాని చేసిన ప్రసంగం తనకు సంతృప్తి కలిగించ లేదని చెప్పారు. నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అదానీ కుంభకోణాల వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు.

''ప్రధాని ప్రసంగంతో నేను సంతృప్తి చెందలేదు. ఎంక్వయిరీ (అదానీ వ్యవహారంలో) గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. గౌతమ్ అదానీ ఆయనకు మిత్రుడు కాకపోతే, ఆయన కంపెనీల వ్యవహారంపై ఎంక్వయిరీ జరిపిస్తామని చెప్పాలి. అదానీని ఆయన కాపాడుతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది'' అని రాహుల్ అన్నారు.

దీనికి ముందు, మోదీ తన ప్రసంగంలో ప్రతిపక్షాలపై చురకలు వేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారని, అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారని మోదీ పరోక్షంగా రాహుల్ గాంధీపై సెటైర్ వేశారు. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారని, నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని అన్నారు. గతంలో తన సమస్యల పరిష్కారం కోసం భారత్ ఇతరులపైన ఆధారపడేదని, నేడు భారతే ఇతర సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. నేడు భారత్ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోందని మోదీ చెప్పారు. ఇది కొంతమందికి కంటగింపుగా ఉండొచ్చని, తనకైతే గర్వంగా ఉందని ప్రధాని చెప్పారు. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారని ప్రతిపక్ష నేతలను మోదీ ఎద్దేవా చేశారు. కొందరు నిరాశలో మునిగిపోయి దేశ విజయాలను సహించలేకపోతున్నారని మోదీ చెప్పారు. నేడు అనేక దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయని, భారత్ మాత్రం ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందన్నారు. భారత్‌లో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మోదీ చురకలు వేశారు.

Updated Date - 2023-02-08T19:24:49+05:30 IST