Defamation Case: రాహుల్‌కు మళ్లీ నిరాశ, వేసవి సెలవుల వరకు వేచిచూడాల్సిందే..!
ABN , First Publish Date - 2023-05-02T18:30:33+05:30 IST
గాంధీనగర్ : 'మోదీ ఇంటిపేరు' వ్యాఖ్యల వ్యవహారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కి మరోసారి..
గాంధీనగర్ : 'మోదీ ఇంటిపేరు' (Modi Surname) వ్యాఖ్యల వ్యవహారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మరోసారి నిరాశ ఎదురైంది. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో దోషిగా నిర్దారిస్తూ దిగువ కోర్టు విధించిన శిక్షపై 'తాత్కాలిక స్టే' (Interm Stay) ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) మంగళవారంనాడు నిరాకరించింది. రాహుల్ పిటిషన్‌పై వేసవి సెలవుల అనంతరం, జూన్ 4వ తేదీ తరువాత తీర్పు ఇవ్వనుంది. తనకు విధించిన శిక్షపై తీర్పు ప్రకటించేంత వరకూ తాత్కాలిక స్టే ఇవ్వాల్సిందిగా రాహుల్ తన పిటిషన్‌లో కోరారు.
కేసు వివరాలు...
రాహుల్ గాంధీ కర్ణాటకలోని కోలార్‌లో 2019 ఏప్రిల్ 13న జరిగిన ఎన్నికల ర్యాలీలో ''దొంగలందరికీ మోదీ పేరు కామన్‌పై ఎందుకు ఉంటుంది?''అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఐపీసీలోని సెక్షన్ 499, 500 కింద రాహుల్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు వేశారు. దీనిపై మార్చి 23న సూరత్ కోర్టు తీర్పునిస్తూ, రాహుల్‌ను దోషిగా నిర్ధారించింది. రెండేళ్ల జైలుశిక్ష విధించింది. పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు రాహుల్‌కు 30 రోజుల గడువు ఇస్తూ, బెయిల్ కూడా మంజూరు చేసింది. రెండేళ్ల శిక్ష నేపథ్యంలో రాహుల్ వయనాడ్ లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ రద్దు చేసింది. ఈ క్రమంలోని తన అధికారిక బంగ్లాను కూడా రాహుల్ ఇటీవల ఖాళీ చేశారు.
కాగా, దిగువ కోర్టు తీర్పును తొలుత సెషన్స్ కోర్టులో సవాలు చేసిన రాహుల్, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 29న వాదోపవాదనలు జరిగాయి. తన క్లయింట్ ఎలాంటి తీవ్ర నేరానికి పాల్పడలేదని, ఆయనకు విధించిన శిక్ష కారణంగా రాహుల్ లోక్‌సభ సభ్యుత్వం రద్దు కావడం ఆయనతో పాటు, ఆయన నియోజకవర్గ ప్రజలపై ఆ ప్రభావం పడుతుందని రాహుల్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదన వినిపించారు. దీనికి ముందు, ఏప్రిల్ 3న రాహుల్ తరఫు లాయరు సెషన్ కోర్టును రెండు పిటిషన్లతో ఆశ్రయించారు. బెయిల్ కోరుతూ ఒక పిటిషన్, శిక్షపై స్టే ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు. కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ, ఆయనకు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. 30 రోజుల్లోగా పైకోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం ఇచ్చింది. గతవారం ఈ కేసును అత్యవసరంగా విరించాలంటూ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి గీతా గోపి ముందుకు రాగా, ఆమె కేసు విచారణను జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్‌కు అప్పగించారు.