Union Budget 2023: పొరపాటున నోరుజారి..నవ్వేసిన నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2023-02-01T17:43:44+05:30 IST

వార్షిక బడ్జెట్ అంటేనే సహజంగా ఉత్కంఠ ఉంటుంది. ఏ వర్గాలపై ప్రభుత్వం వరల జల్లులు కురిపిస్తుందో, ఏ రంగాల్లో వడ్డనలు ఉంటాయో అనే ఉత్సుకత ..

Union Budget 2023: పొరపాటున నోరుజారి..నవ్వేసిన నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ: వార్షిక బడ్జెట్ అంటేనే సహజంగా ఉత్కంఠ ఉంటుంది. ఏ వర్గాలపై ప్రభుత్వం వరల జల్లులు కురిపిస్తుందో, ఏ రంగాల్లో వడ్డనలు ఉంటాయో అనే ఉత్సుకత నెలకొంటుంది. అందులోనూ బడ్జెట్ కోసం రోజుల తరబడి కసరత్తు చేసిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)కు వరుసగా ఇది ఐదో బడ్జెట్ కూడా. నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్‌ (Union Budget 2023-24)ను బుధవారంనాడు పార్లమెంటుకు సమర్పిస్తూ, 87 నిమిషాల పాటు అనర్ఘళంగా ప్రసంగం సాగించారు. ఈ క్రమంలోనే ఆమె ఒకచోట పొరపాటున నోరుజారి, ఆ వెంటనే సరిదిద్దుకున్నారు. 'సారీ' అంటూ చెప్పడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిసాయి.

బడ్జెట్‌లోని ఏడు ప్రాధాన్యతాంశాలలో ఒకటైన 'గ్రీన్ గ్రోత్‌'పై మంత్రి ప్రస్తావిస్తూ పొరపాటున నోరుజారారు. పాతబడిన పొల్యూటెడ్ వాహనాలను వెనక్కి తీసుకోవడం అనే కీలక విధాన నిర్ణమని గురించి మాట్లాడుతూ, రీప్లేసింగ్ పొల్యూటెడ్ వెహికల్స్ అనడానికి బదులుగా 'రీప్లేసింగ్ ఓల్డ్ పొలిటికల్..' అనే పదం వాడారు. అయితే, వెంటనే మంత్రి తన పొరపాటును సరిదిద్దుకుంటూ... 'ఓ...సారీ' అంటూ నవ్వేశారు. దీంతో ఒక్కసారిగా సభ నవ్వులతో నిండిపోయింది. మంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ....''నాకు తెలుసు. రీప్లేసింగ్ ఓల్డ్ పొల్యూటింగ్ వెహికల్స్...సరేనా? ఎకానమీ గ్రీనింగ్‌లో కాలుష్యకారక వాహనాలను వెనక్కి తీసుకోవడం చాలా కీలకం. 2021-22 బడ్జెట్‌లో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ గురించి ప్రస్తావించం. కేంద్ర ప్రభుత్వ వాహనాలను స్క్రాప్‌గా మార్చేందుకు తగిన నిధులను నేను కేటాయించాను. రాష్ట్రాలు కూడా తమ పాత వాహనాలు, అంబులెన్స్‌లు వెనక్కి తీసుకునే విషయంలో సహకరించాలి'' అని నిర్మలా సీతారామన్ అన్నారు. పాతబడిన వాహనాలను వెనక్కి తీసుకోవడంతో పాటు, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఎనర్జీ ట్రాన్సిషన్, ఎనర్జీ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఎవాక్యుయేషన్ వంటి అంశాలను కూడా మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. అలాగే, సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా పొదుపు చేసుకునే అవకాశం ఉందని, దీనిని రూ.30 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజీ పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తులవారికి సహాయపడటానికి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

Updated Date - 2023-02-01T17:43:47+05:30 IST