Share News

MP assembly polls: నామినేషన్ దాఖలు చేసిన సీఎం శివరాజ్

ABN , First Publish Date - 2023-10-30T17:56:55+05:30 IST

బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సెహోర్ జిల్లా బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సోమవారంనాడు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. శివరాజ్ వెంట ఆయన భార్య సాధానా సింగ్ చౌహాన్ హాజరయ్యారు.

MP assembly polls: నామినేషన్ దాఖలు చేసిన సీఎం శివరాజ్

సెహోర్: బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ (Madhya pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj Singh Chouhan) సెహోర్ జిల్లా బుద్ని (Budhni) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సోమవారంనాడు నామినేషన్ (nomination) పత్రాలు దాఖలు చేశారు. శివరాజ్ వెంట ఆయన భార్య సాధానా సింగ్ చౌహాన్ హాజరయ్యారు.


నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు శివరాజ్ సింగ్ తన స్వగ్రామమైన జైత్ వెళ్లారు. అక్కడ రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజాసేవకు తాము అంకతమయ్యామని, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడేలా చూడటమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కేవలం ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను రాలేదని, మధ్యప్రదేశ్‌ను, బుద్నీ నియోజకవర్గాన్ని మార్పు చేసేందుకు, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చేందుకు, రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామాన్ని విడిచిపెట్టకుండా అభివృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజలే తన కుటుంబ సభ్యులని, వారి కోసం తన పూర్తి శక్తియుక్తులతో పని చేస్తానని భరోసా ఇచ్చారు. కాగా, 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-10-30T17:56:55+05:30 IST