Bengal Panchayat polls: కేంద్ర బలగాల మోహరింపు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు మమత సర్కార్

ABN , First Publish Date - 2023-06-17T15:39:58+05:30 IST

పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలంటూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంయుక్తంగా శనివారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి.

Bengal Panchayat polls: కేంద్ర బలగాల మోహరింపు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు మమత సర్కార్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో (Bengal Panchayat Polls) కేంద్ర బలగాలను మోహరించాలంటూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వం సుప్రీంకోర్టులో (Supreme court) సవాలు చేసింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) సంయుక్తంగా శనివారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం తరఫు సీనియర్ అధికారులు శుక్రవారంనాడు సమావేశమై హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి.

పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కోసం 48 గంటల్లోగా కేంద్ర బలగాలను మోహరించేలా చూడాలంటూ కోల్‌కతా హైకోర్టు గత బుధవారంనాడు ఎస్ఈసీకి ఆదేశాలిచ్చింది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో హింస చెలరేగడాన్ని హైకోర్టు ప్రస్తావిస్తూ, జూన్ 13న తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ సమర్ధవంతమైన చర్యలు తీసుకోలేదని పేర్కొంది.

బీజేపీ ఫిర్యాదు

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కేంద్ర బలగాలను మోహరించేలా తగిన ఆదేశాలివ్వాలంటూ బీజేపీ నేతలు సువేందు అధికారి, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి హైకోర్టును ఇంతకుముందు ఆశ్రయించారు. 2022 మున్సిపల్ ఎన్నికల్లోనూ, 2021లో కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పెద్దఎత్తున హింస చెలరేగిన ఘటనలను తమ పిటిషన్లలో వారు కోర్టు దృష్టికి తెచ్చారు.

నామినేషన్ ప్రక్రియలో హింస..

కాగా, పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలుకాగానే పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జూన్ 9న నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. విపక్ష నేతలను నామినేషన్ల వేయకుండా అధికార టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుంటూ అల్లర్లు సృష్టిస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం ఆరోపించాయి. సౌత్ 24 పరగాణాలు, బంకుర జిల్లాలో నామినేషన్లు దాఖలను అడ్డుకునేందుకు బాంబులు విరుసుతూ, రాళ్లు రువ్వుతూ, కార్లను ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అల్లరి మూకలను అడ్డుకునేందుకు ఆర్‌ఏఎఫ్ బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నారు. ఇండస్, బంకురా జిల్లాలో ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగినట్టు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఏ రాష్ట్రంలోనూ లేనంత ప్రశాంతంగా బెంగాల్‌లో నామినేషన్ల ప్రక్రియ జరిగిందన్నారు. కేవలం ప్రచారం కోసమే విపక్ష పార్టీలు రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ దుష్ప్రచారం సాగిస్తున్నాయని మండిపడ్డారు. మూడంచెల పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికలు జూలై 8న ఒకే విడతలో జరుగనున్నాయి.

Updated Date - 2023-06-17T15:43:35+05:30 IST