Mamata Benerjee: గ్యాస్ ధర తగ్గింపుపై మమతా బెనర్జీ కేంద్రంపై ధ్వజం.. ఇదీ ఇండియా దెబ్బ!

ABN , First Publish Date - 2023-08-29T21:58:52+05:30 IST

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ ధరల్ని రూ.200 తగ్గించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ఇది బీజేపీ ఎన్నికల జిమ్మిక్...

Mamata Benerjee: గ్యాస్ ధర తగ్గింపుపై మమతా బెనర్జీ కేంద్రంపై ధ్వజం.. ఇదీ ఇండియా దెబ్బ!

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ ధరల్ని రూ.200 తగ్గించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ఇది బీజేపీ ఎన్నికల జిమ్మిక్ అని మండిపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం తనదైన శైలిలో కేంద్రంపై కౌంటర్లు వేశారు. విపక్షాల కూటమి అయిన ఇండియా ఇప్పటివరకు రెండు నెలల్లో రెండు సమావేశాలే నిర్వహించిందని, ఈలోపే కేంద్రం దిగొచ్చి గ్యాస్ ధర తగ్గించిందని దుయ్యబట్టారు. ‘‘ఇండియా కూటమి గత రెండు నెలల్లో రెండు సమావేశాలు నిర్వహించింది. ఇప్పుడు గ్యాస్ ధరను రూ.200 తగ్గించడాన్ని మనం చూస్తున్నాం. ఇదీ ‘ఇండియా’ దెబ్బ అంటే’’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు.


ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం దీనిని ఎన్నికల లాలీపాప్‌గా అభివర్ణించారు. ఎప్పుడైతే బీజేపీకి ఓట్లు తగ్గడం ప్రారంభమైందో, అప్పటి నుంచి ఆ పార్టీ ఎన్నికల కానుకలు ఇవ్వడం మొదలుపెట్టిందని చురకలంటించారు. కనికరం లేని మోదీ ప్రభుత్వం ఇన్నాళ్లూ ప్రజల కష్టార్జితాన్ని దోచుకుందని.. ఇప్పుడు గ్యాస్ ధరలు తగ్గిస్తూ బూటకపు నాటకాలకు తెరలేపిందని మండిపడ్డారు. గత తొమ్మిదిన్నరేళ్లుగా రూ.400లు ఉన్న ఎల్‌పీజీ సిలిండర్‌ను రూ.1100కి అమ్ముతూ సామాన్యుల జీవితాలను నాశనం చేస్తూ వచ్చిన బీజేపీ.. ఆ సమయంలో ప్రజల కష్టాలు కనిపించలేదా? అని నిలదీశారు. తొమ్మిదిన్నరేళ్ల నుంచి 140 కోట్ల భారతీయుల్ని కష్టపెడుతున్న బీజేపీ.. ఇప్పుడు ఎన్నికల లాలీపాప్ పంచడంతో పనికిరాదన్నారు. దశాబ్దం నుంచి మీరు చేస్తున్న పాపాలు అంత సులువుగా కడిగివేయబడవని దుయ్యబట్టారు.

మరోవైపు.. ఈ విమర్శల్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తేలిగ్గా తీసిపారేశారు. రాఖీ పండుగ సందర్భంగా గ్యాస్ ధరల్ని తగ్గించినందుకు గాను ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘రాఖీ సందర్భంగా ఈ కానుక ఇచ్చినందుకు మహిళల తరఫున నేను మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. అనంతరం ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘ప్రతిపక్షాలు తమ సమావేశాలు కొనసాగిస్తూ ఉంటే, ఈ దేశానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-08-29T21:58:52+05:30 IST