Karnataka Results: కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య? ముగ్గురు డిప్యూటీ సీఎంలు?

ABN , First Publish Date - 2023-05-13T21:48:21+05:30 IST

అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థిత్వంపై ..

Karnataka Results: కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య? ముగ్గురు డిప్యూటీ సీఎంలు?

బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్ అఖండ విజయం(Landslide Victory) సాధించింది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కాంగ్రెస్ శ్రేణులకు అభినందనలు తెలిపారు. అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థిత్వంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సీఎం అభ్యర్థి రేసులో సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌లు పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తుండగా..మాజీ సీఎం సిద్ధరామయ్య వైపే పార్టీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ అఖండ విజయంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌ను పార్టీ అధిష్టానం తోసిపుచ్చనప్పటికీ.. సిద్ధరామయ్యకే సీఎం పదవికి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

కర్ణాటకలో క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత ముఖ్యమంత్రిని నిర్ణయించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం తలమునకలైనట్లు తెలుస్తోంది. సీఎం రేసులో ఇద్దరు అగ్రనేతలు మాజీ సీఎం, రేసుగుర్రం సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, ట్రబుల్ షూటర్ డికె శివకుమార్‌లలో ఎవరికి సీఎం కుర్చీ కట్టబెట్టాలో కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌లో జరిగిన సీన్ రిపీట్ అవుతుందా? అనే సందేహాలనేపథ్యంలో దాదాపు నాలుగేళ్ల పాటు రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా సచిన్ పైలట్ ఉండి పార్టీకి గెలుపు కట్టబెట్టగా, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని అశోక్ గెహ్లాట్‌కు సీఎం పదవి, సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం చేయాలని పార్టీ భావించింది. పైలట్‌కు గాంధీల మద్దతు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలేదు.

కర్ణాటకలో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. సిద్దరామయ్య ప్రజాదరణ పొందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వెనకబడిన కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. అణగారిన వర్గాల అభివృద్ధి మంత్రం జపిస్తున్న కాంగ్రెస్‌కు సిద్ద రామయ్య సీఎం అయితే లోక్‌సభ ఎన్నికలకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది.

సిద్ధరామయ్యకు సీఎం పదవి దక్కుతుందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నప్పటికీ, డీకే శివకుమార్‌కూ అవకాశం లేకపోలేదు. అధిష్టానం ఆశీస్సులు, రాహుల్‌కు డీకేకు ఉన్న సాన్నిహిత్యం, పార్టీకి వీరవిధేయుడుగా పనిచేయడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయనను సీఎం చేస్తారని డీకే వర్గం భావిస్తోంది. రాజస్థాన్, మహారాష్ట్రలో ఆపద సమయంలో పార్టీని ఆదుకున్నాడని డీకే శివకుమార్ ఆ పదవికి యోగ్యుడని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అయితే సచిన్ పైలట్ విషయంలో చేసిన తప్పిదాన్నే కాంగ్రెస్ మళ్లీ చేస్తుందా? ఒకవేళ అలా చేస్తే పార్టీలో కొత్త రక్తం, తరం మార్పుపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదనే సందేశాన్ని పంపుతున్నట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో కర్ణాటకలో కొత్తగా కొలువుదీరే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. అధిష్టానం సీఎం పదవితో పాటు మూడు డిప్యూటీ సీఎం పదవులు, లింగాయత్ వర్గానికి చెందిన ఒకరికి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2023-05-13T21:53:18+05:30 IST