Modi Vs Sibal : మోదీ ‘సుపారీ’ ఆరోపణలపై కపిల్ సిబల్ అనూహ్య స్పందన

ABN , First Publish Date - 2023-04-02T10:01:21+05:30 IST

తన కీర్తి, ప్రతిష్ఠలపై బురద జల్లేందుకు ఇంటాబయటా కొందరు సుపారీ (కాంట్రాక్టు) ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Modi Vs Sibal : మోదీ ‘సుపారీ’ ఆరోపణలపై కపిల్ సిబల్ అనూహ్య స్పందన
Narendra Modi, Kapil Sibal

న్యూఢిల్లీ : తన కీర్తి, ప్రతిష్ఠలపై బురద జల్లేందుకు ఇంటాబయటా కొందరు సుపారీ (కాంట్రాక్టు) ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చేసిన ఆరోపణలపై రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్ (Kapil Sibal) అనూహ్యంగా స్పందించారు. సుపారీ ఇచ్చినవారి పేర్లు బయటపెట్టాలని, అది అంతఃపుర రహస్యంగా ఉండిపోకూడదని స్పష్టం చేశారు.

మోదీ శనివారం భోపాల్-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, తన కీర్తి, ప్రతిష్ఠలపై బురద జల్లేందుకు సుపారీ ఇచ్చారన్నారు. ‘‘మన దేశంలో కొందరు ఉన్నారు. వారు 2014 నుంచి దృఢంగా నిశ్చయించుకున్నారు. మోదీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే తమ దృఢ సంకల్పాన్ని బహిరంగంగా మాట్లాడి, ప్రకటించారు’’ అని తెలిపారు. ‘‘నాపై బురద జల్లడం కోసం వాళ్లు చాలా మందికి సుపారీ ఇచ్చారు. వారికి మద్దతిచ్చేందుకు కొందరు దేశంలోనే తిష్ఠ వేశారు, మరికొందరు దేశం వెలుపల కూర్చుని పని చేస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘ప్రతి భారతీయుడు నాకు రక్ష. అందుకే వీరికి ఆగ్రహం కలుగుతోంది, కొత్త కొత్త చిట్కాలను అమలు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది’’ అన్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) 2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఎలా ఉంటోందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ దోషి అని తీర్పు చెప్పి, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం ఆయన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడని పార్లమెంటు సచివాలయం ప్రకటించింది. అయితే ఈ కోర్టు తీర్పుపై అపీలు చేసుకునే అవకాశం రాహుల్ గాంధీకి ఉంది. ఇదిలావుండగా, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని పరిశీలిస్తున్నామని అమెరికా, జర్మనీ ప్రకటించడంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మన దేశ అంతర్గత వ్యవహారాల్లోకి విదేశీ జోక్యాన్ని కాంగ్రెస్ ఆహ్వానిస్తోందని మండిపడుతోంది.

ఈ నేపథ్యంలో కపిల్ సిబల్ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, మోదీ సమాధి తవ్వడానికి దేశంలో ఉన్న కొందరికి, విదేశాల్లో ఉన్న మరికొందరికి ఎవరో కాంట్రాక్టు ఇచ్చినట్లు మోదీ ఆరోపిస్తున్నారు. ‘‘ఆ కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తులు, సంస్థలు లేదా దేశాల గురించి చెప్పండి, ఇది అంతఃపుర రహస్యంగా ఉండిపోకూడదు’’ అన్నారు. వారిని మనం విచారించాలన్నారు.

ఇవి కూడా చదవండి :

Elections: టికెట్ల కోసం జోరందుకున్న పైరవీలు

Elections: ఆ నియోజకవర్గంలో బీజేపీకి ఎదురే లేదు.. కానీ.. తాజా పరిస్థితి చూస్తే...

Updated Date - 2023-04-02T10:01:21+05:30 IST