INDIA Alliance: ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ‘ఆయనే’.. అందుకు అన్ని క్వాలిటీలు ఉన్నాయి

ABN , First Publish Date - 2023-09-24T15:56:59+05:30 IST

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇందులో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే విషయంపై మాత్రం ఉత్కంఠ...

INDIA Alliance: ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ‘ఆయనే’.. అందుకు అన్ని క్వాలిటీలు ఉన్నాయి

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇందులో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే విషయంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై తామింకా నిర్ణయం తీసుకోలేదని కూటమి నేతలు చెప్తున్నప్పటికీ.. ప్రధాని అభ్యర్థి బరిలో ఎవరున్నారనే సస్పెన్స్‌పై మాత్రం తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో.. బిహార్ విధానసభ డిప్యూటీ స్పీకర్‌, జనతాదళ్‌ (యునైటెడ్‌) నాయకుడు మహేశ్వర్‌ హజారీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థిగా ఎదిగే అర్హత ఒక్క నితీశ్ కుమార్‌కి మాత్రమే ఉందని.. ఆయనను మించిన సమర్థుడైన నాయకుడు మరొకరు లేరని కుండబద్దలు కొట్టారు. నితీశ్‌నే ప్రధాని అభ్యర్థిగా ఇండియా కూటమి భవిష్యత్తులో ప్రకటిస్తుందని హజారీ ధీమా వ్యక్తం చేశారు.


ఆదివారం మహేశ్వర్ హజారీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒక ప్రధానమంత్రికి ఉండాల్సిన లక్షణాలన్నీ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఆయనని మించిన సమర్థుడైన నాయకుడు మరొకరు లేరు. భవిష్యత్తులో ఇండియా కూటమి నితీశ్ కుమార్‌నే ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తుంది’’ అని తెలిపారు. దేశంలో రామ్‌మనోహర్‌ లోహియా తర్వాత మహోన్నతమైన సోషలిస్టు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది నితీష్‌ కుమార్‌ మాత్రమేనని గతంలో ప్రధాని మోదీ చెప్పారని హజారీ గుర్తు చేసుకున్నారు. నితీష్ కుమార్ ఐదుసార్లు కేంద్రంలో మంత్రిగా పనిచేశారని, 18 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ సన్నద్ధతపై మీడియా ప్రశ్నించగా.. అందుకు ఈ విధంగా హజారీ సమాధానం ఇచ్చారు. హజారీతో పాటు ఇతర నాయకులు సైతం.. నితీశ్ కుమారే ప్రధాని అభ్యర్థి అవ్వొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. నితీష్ కుమార్ మాత్రం తనకు ప్రధాని పదవిపై ఎలాంటి ఆశలు లేవని ఇదివరకే అన్నారు. కానీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాల ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తానని చాలాసార్లు చెప్పారు. ‘‘నాకు ప్రధాని పదవిపై ఎలాంటి ఆశలు లేవని ఇంతకుముందే చెప్పాను, మళ్లీ మళ్ళీ పునరావృతం చేస్తాను. ప్రతిపక్ష నాయకులు ఏకమై ముందుకు సాగాలన్నదే నా కోరిక. ఇది మొత్తం దేశానికి ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని నితీశ్ గతంలో అన్నారు. ఇదిలావుండగా.. ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ మూడు సమావేశాలు నిర్వహించింది. ఈ చర్చల్లో తమ భవిష్యత్తు వ్యూహాలు, ఇతర అంశాలపై చర్చలు జరిపారు కానీ.. ప్రధాని అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌కి మాత్రం తెరదించలేదు.

Updated Date - 2023-09-24T15:56:59+05:30 IST