Jammu and Kashmir : మోదీకి బాలిక లేఖతో సత్ఫలితాలు.. పాఠశాల అభివృద్ధి ప్రారంభం..

ABN , First Publish Date - 2023-04-20T11:18:01+05:30 IST

జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)కు చెందిన ఓ విద్యార్థిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి రాసిన లేఖ వల్ల

Jammu and Kashmir : మోదీకి బాలిక లేఖతో సత్ఫలితాలు.. పాఠశాల అభివృద్ధి ప్రారంభం..
Seerat Naaz, Jammu and Kashmir, Narendra Modi

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)కు చెందిన ఓ విద్యార్థిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి రాసిన లేఖ వల్ల సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆమె కోరిక ప్రకారం ఆమె చదువుతున్న పాఠశాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మోదీకి ఆమె పంపిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

కథువా జిల్లాలోని మారుమూల గ్రామం లొహాయ్-మల్హర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న సీరత్ నాజ్ (Seerat Naaz) మోదీకి ఇటీవల ఓ లేఖను రాసిన సంగతి తెలిసిందే. తాను చదువుతున్న పాఠశాల దుస్థితిని ఆమె వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. పాఠశాలలోని ప్రిన్సిపాల్ గది, సిబ్బంది గది, మరుగుదొడ్డి, పాఠశాల ఆవరణ వంటివాటిలో కలియదిరుగుతూ, వాటి దుస్థితిని వివరిస్తూ ఆమె ఓ వీడియోను చిత్రీకరించింది. దానిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ‘‘దేశ ప్రజల మాట వినే మోదీ గారూ, నా మాట కూడా వినండి. నేను మీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. మా పాఠశాలలో సదుపాయాలు లేవు. నేలపై దుమ్ము, ధూళి విపరీతంగా ఉన్నాయి. దానిపై కూర్చుంటే బట్టలు మురికి అయిపోతున్నాయి. మా అమ్మ మందలిస్తోంది. మా కోసం మంచి పాఠశాలను నిర్మించండి’’ అని ఆమె మోదీని కోరింది.

ఈ వీడియో వైరల్ అవడంతో జమ్మూ పాఠశాల విద్య సంచాలకుడు (డైరెక్టర్) రవిశంకర్ శర్మ ఆ పాఠశాలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ పాఠశాలను ఆధునికంగా తీర్చిదిద్దడం కోసం రూ.91 లక్షలతో ఓ ప్రాజెక్టును మంజూరు చేశామని చెప్పారు. అయితే కొన్ని పరిపాలనాపరమైన అనుమతుల కోసం ఎదురు చూస్తున్నందువల్ల ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించామని చెప్పారు. పాఠశాలను అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయని చెప్పారు. జమ్మూ ప్రావిన్స్‌లోని అన్ని జిల్లాల్లోనూ కొత్తగా 1,000 కిండర్‌గార్టెన్లను నిర్మించడం ప్రారంభించామని చెప్పారు. రానున్న మూడు, నాలుగేళ్ళలో ఈ ప్రావిన్స్‌లోని 10 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో 250 చొప్పున కిండర్‌గార్టెన్లను నిర్మిస్తామని చెప్పారు.

ఈ నేపథ్యంలో సీరత్ నాజ్ స్పందిస్తూ, తన వీడియో వల్ల తన పాఠశాల అభివృద్ధి పనులు ప్రారంభం కావడం చాలా సంతోషకరమని చెప్పింది. తాను ఐఏఎస్ అధికారిని కావాలని కోరుకుంటున్నానని తెలిపింది.

ఇవి కూడా చదవండి :

Marathon: మాంచెస్టర్ మారథాన్‌లో సత్తాచాటిన భారతీయ మహిళ

Minister: బీజేపీ రాష్ట్ర నేతకు పరువునష్టం దావా నోటీసు

Updated Date - 2023-04-20T11:18:01+05:30 IST