Abhishek Banerjee: నేను బటన్ నొక్కానంటే..?.. కాంగ్రెస్‌పై అభిషేక్ బెనర్జీ పంచ్..!

ABN , First Publish Date - 2023-05-29T20:54:05+05:30 IST

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పశ్చిమబెంగాల్ కాంగ్రెస్‌‌పై నిప్పులు చెరిగారు. తాను బటన్ నొక్కితే నలుగురు కాంగ్రెస్ ఎంపీలు టీఎంసీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Abhishek Banerjee: నేను బటన్ నొక్కానంటే..?.. కాంగ్రెస్‌పై అభిషేక్ బెనర్జీ పంచ్..!

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhisekh Banerjee) పశ్చిమబెంగాల్ కాంగ్రెస్‌‌పై నిప్పులు చెరిగారు. తాను బటన్ నొక్కితే నలుగురు కాంగ్రెస్ ఎంపీలు (Congress MPs) టీఎంసీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ప్రధాన రాజకీయ శక్తి అని, వామపక్షాలు-కాంగ్రెస్ మధ్య పొత్తు వల్ల బీజేపీ మాత్రమే లాభపడిందన్నారు.

టీఎంసీలో చేరిన కాంగ్రెస్‌ ఏకైక ఎమ్మెల్యే...

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ సోమవారంనాడు టీఎంసీ పార్టీలోకి చేరారు. గత ఏడాది ముర్షీదాబాద్ జిల్లాలోని సాగర్‌డిఘి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బిశ్వాస్ పోటీ చేసి గెలుపొందాడు. వామపక్షాలు బిశ్వాస్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఆయన తాజాగా టీఎంసీలో చేరడంతో కాంగ్రెస్ ఖాళీ అయింది. బిశ్వాస్ తమ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని, ముర్షీదాబాద్‌లో తమ పార్టీ సైనికుడిగా ఆయన ఉంటారని అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. బిశ్వాస్ రాజీనామా చేసి మరోసారి ఉప ఎన్నికల్లో నిలబడతారా అని అభిషేక్ బెనర్జీని ప్రశ్నించగా, బిశ్వాస్ టీఎంసీలో చేరడం పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుందా లేదా అనేది స్పీకర్ నిర్ణయిస్తారని, స్పీకర్ చెబితే ఆయన మరోసారి పోటీ చేస్తారని చెప్పారు. కాగా, బీజేపీపై పోరాటానికి అధీర్ రంజన్ చౌదరి సిద్ధంగా లేరని, టీఎంసీపై విరుచుకుపడటానికే ఆయన సమయం కేటాయిస్తున్నారని, ఆ కారణంగానే తాను ఆ పార్టీని వదిలిపెట్టానని బిశ్వాస్ తెలిపారు. ఉప ఎన్నికలో తన గెలుపునకు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. 2021లో ఆ పార్టీ ఒక్కసీటైనా గెలిచిందా అని ప్రశ్నించారు.

బిశ్వాస్ ద్రోహి: కాంగ్రెస్

ఉప ఎన్నికల్లో బిశ్వాస్‌కు టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే టీఎంసీ చేరిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. బిశ్వాస్ విశ్వాసఘాతకుడని విమర్శించింది. సాగర్‌డిఘిలో ఓటమిని టీఎంసీ జీర్ణించుకులేకపోయిందని, బిశ్వాస్‌పై మూడు నెలలుగా ఒత్తిడి తెస్తూ వచ్చిందని అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ప్రజాతీర్పును బిశ్వాస్ కాలరాశారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎంతోకష్టపడి అతన్ని గెలిపించుకున్నారని అన్నారు.

తిప్పికొట్టిన అభిషేక్ బెనర్జీ...

కాంగ్రెస్ ఆరోపణలను అభిషేక్ బెనర్జీ తిప్పికొట్టారు. తాను బటన్ నొక్కితే నలుగురు ఎంపీలు రేపే తమ పార్టీలో చేరుతారని, వారిలో బయట రాష్ట్రాల ఎంపీలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. వారి పేర్లు చెబితే కాంగ్రెస్ షాక్ తినాల్సిందేనని అన్నారు. అయితే తాము మర్యాద తెలిసిన వారమని, అలాంటి పనులకు పాల్పడమని చెప్పారు. ''మేము తలుపులు తెరిస్తే ఆయన (అధీర్ రంజన్) సొంత పార్టీ నేతలను మాపార్టీలోకి రాకుండా ఏమాత్రం ఆపలేరు'' అని అభిషేక్ హెచ్చరించారు.

పశ్చిమబెంగాల్‌లో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 213 సీట్లలో గెలుపొందగా, బీజేపీ 77 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌, వామపక్షాలు ఖాతా కూడా తెరవలేదు. రెండు స్థానాలకు ఎన్నికలు వాయిదా పడగా, ఆ తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో ఆ రెండు సీట్లను టీఎంసీ గెలుచుకుంది. సాగర్‌డిఘి టీఎంసీ ఎమ్మెల్యే సుబ్రత సహా మరణంతో ఇటీవల అక్కడ జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ టిక్కెట్‌పై బేరాన్ బిశ్వాస్ గెలిచారు.

Updated Date - 2023-05-29T20:54:07+05:30 IST