Share News

Siddaramaiah: హిందుత్వం, హిందూ వేర్వేరు: సిద్ధరామయ్య

ABN , Publish Date - Dec 29 , 2023 | 03:50 PM

హిందుత్వ సిద్ధాంతము, హిందూ విశ్వాసాల మధ్య తేడా ఉందంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వివాదానికి తెరతీశారు. ఒక వైపు మైనారిటీ ఓట్లు పోకుండా, మరోవైపు మోడరేట్ హిందూ ఓట్లు దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహంగా 'సాఫ్ట్ హిందుత్వ'ను పావుగా వాడుకుంటున్నట్టు కనిపిస్తోందన్నారు.

Siddaramaiah: హిందుత్వం, హిందూ వేర్వేరు: సిద్ధరామయ్య

బెంగళూరు: హిందుత్వ సిద్ధాంతము, హిందూ విశ్వాసాల మధ్య తేడా ఉందంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) మరోసారి వివాదానికి తెరతీశారు. ఒక వైపు మైనారిటీ ఓట్లు పోకుండా, మరోవైపు మోడరేట్ హిందూ ఓట్లు దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహంగా 'సాఫ్ట్ హిందుత్వ'ను పావుగా వాడుకుంటున్నట్టు కనిపిస్తోందన్నారు. హిందుత్వలో సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ ఏమిటని నిలదీశారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


''హిందుత్వ అంటే హిందుత్వనే. నేను హిందువుని. హిందుత్వం, హిందు అనేవి వేర్వేరు. మనం రాముడిని ఆరాధించ లేదా? వాళ్లు (బీజేపీ) మాత్రమే రాముడిని ఆరాధిస్తున్నారా? మన గ్రామాల్లో రామమందిరాలు నిర్మించలేదా? రాముడి భజనలు చేయలేదా? '' అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. డిసెంబర్ చివరి వారంలో భజనలు జరుగుతుంటాయని, తమ గ్రామంలోనూ అలాంటి వేడుకలు జరుగుతుంటాయని, తాను సైతం అందులో పాలుపంచుకుంటూ ఉంటానని చెప్పారు.


సిద్ధరామయ్య గత ఫిబ్రవరిలోనూ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ అనేది రాజ్యాంగవిరుద్ధమని, హిందుత్వ, హిందూ ధర్మం వేర్వేరని అన్నారు. తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని, తాను హిందువునని, కానీ మనువాదం, హిందుత్వకు వ్యతిరేకినని చెప్పారు. హత్యలను ఏ మతం సమర్ధించదని, కానీ హిందుత్వ మద్దతుదారులు హత్యలు, వివక్షను సమర్ధిస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. గత జనవరిలో కూడా తాను హిందువునని, హిందుత్వను వ్యతిరేకిస్తానని ఆయన చెప్పారు. తాను రామాలయాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ రాజకీయ ప్రయోజనాలకు దానిని వాడుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలు మరో నాలుగు నెలల్లోగా జరగాల్సి ఉండటం, దీనికి ముందు వచ్చే జనవరి 22న అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో మరోసారి హిందుత్వపై సిద్ధరామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Updated Date - Dec 29 , 2023 | 03:50 PM