Share News

Dynasty Politics: కుటుంబ రాజకీయాల వివాదం.. రాహుల్ గాంధీపై హిమంత సెటైర్లు

ABN , First Publish Date - 2023-10-18T17:58:31+05:30 IST

ఇటీవల కుటుంబ రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల మీద తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. రాజకీయాలపై అవగాహన లేని నిరక్షరాస్యుడు రాహుల్ అని, అతడో చిన్న పిల్లవాడు....

Dynasty Politics: కుటుంబ రాజకీయాల వివాదం.. రాహుల్ గాంధీపై హిమంత సెటైర్లు

ఇటీవల కుటుంబ రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల మీద తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. రాజకీయాలపై అవగాహన లేని నిరక్షరాస్యుడు రాహుల్ అని, అతడో చిన్న పిల్లవాడు అని సెటైర్లు వేశారు. బీజేపీలోని రాజకీయ నేతల కుమారులు సైతం ఉన్నత పదవుల్లో ఉన్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు గాను హిమంత ఆ విధంగా కౌంటర్ వేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు అర్థపర్థం లేనివంటూ ఆయన కొట్టిపారేశారు.


ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారు?

కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు కొనసాగుతున్నాయని బీజేపీ నేతలు ఒకటే మోత మోగిస్తున్న తరుణంలో.. వారికి రాహుల్ గాంధీ మిజోరాం ఎన్నికల ప్రచారంలో చురకలంటించారు. ‘‘అమిత్ షా తనయుడు ఏం చేస్తున్నాడో తెలీదా? ఆయన భారత క్రికెట్‌ను ముందుకు నడుపుతున్నాడని నేను విన్నాను. అలాగే రాజ్‌నాథ్ సింగ్ కొడుకు ఏం చేస్తున్నాడు? మా మీద కుటుంబ రాజకీయాల వ్యాఖ్యలు చేసే ముందు.. తమ పిల్లలు ఏం చేస్తున్నారో బీజేపీ నేతలు తమని తామే ప్రశ్నించుకోవాలి. బీజేపీ నేతల్లోని చాలామంది పిల్లలు కూడా రాజభోగాలు అనుభవిస్తున్నవారే’’ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. కాగా.. అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉండగా.. రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.


రాహుల్ వ్యాఖ్యలపై హిమంత రియాక్షన్

‘‘అసలు కుటుంబ రాజకీయాల్లోకి అమిత్ షా తనయుడు ఎలా వచ్చాడు? ఆయన బీజేపీలోనే లేరు. కానీ.. రాహుల్ కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బీజేపీకి చెందిన వింగ్ అని రాహుల్ భావిస్తున్నారు. అతని గురించి నన్ను అడగొద్దు. అతడు నిరక్షరాస్యుడైన చిన్న పిల్లవాడు. ఇక యూపీలో కేవలం ఎమ్మెల్యేగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ కుమారుడిని ప్రియాంక గాంధీ (కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి)తో పోల్చగలరా? ఆయన బీజేపీని నియంత్రిస్తారా?’’ అంటూ రాహుల్ వ్యాఖ్యలకు హిమంత సమాధానం ఇచ్చారు. రాహుల్‌కు రాజకీయాలపై అవగాహన లేదని, కుటుంబ రాజకీయాలకు తాను మూలమని గుర్తించడం లేదన్నారు. తల్లి, తండ్రి, తాత, సోదరి, సోదరుడు.. ఇలా రాహుల్ కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉన్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ మొత్తాన్నే రాహుల్ కుటుంబం నియంత్రిస్తుందని.. అలాంటి పార్టీని ఆయన బీజేపీతో ఎలా సరిపోల్చి చూస్తారని హిమంత బిశ్వ శర్మ ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని.. ఆయనకు రాజకీయాలపై అవగాహన లేకపోవడం వల్లే బీజేపీతో కాంగ్రెస్‌ని పోల్చి చూస్తున్నారని, బీజేపీలో కుటుంబ రాజకీయాలనేవే లేవని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని, ఆపై కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడాలని హితవు పలికారు. మరి.. దీనికి కాంగ్రెస్ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి.

Updated Date - 2023-10-18T17:58:31+05:30 IST