Govt Advisory For TV channels: అలాంటివి చూపించకండి...

ABN , First Publish Date - 2023-01-09T17:22:34+05:30 IST

నేరాలు, ప్రమాదాలు, దాడులు, హింసకు సంబంధించిన వార్తా ప్రసారాల విషయంలో టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వయిజరీ..

Govt Advisory For TV channels: అలాంటివి చూపించకండి...

న్యూఢిల్లీ: నేరాలు, ప్రమాదాలు, దాడులు, హింసకు సంబంధించిన వార్తా ప్రసారాల విషయంలో టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (Ministry of Information and Broadcasting) అడ్వయిజరీ (advisory) జారీ చేసింది. భయం గొలిపే వీడియోలు, రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫోటోలు, మృతదేహాలను యథావిధిగా రిపోర్ట్ చేయకుండా, బాధ్యతాయుతమైన కంటెంట్ ప్రసారం చేయాలని సూచించింది. నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన విషయాల్లో టీవీ ఛానళ్లు జాగ్రత్తలు తీసుకుని ప్రోగామ్ కోడ్‌కు అనుగుణంగా ఫుటేజ్‌లను ప్రసారం చేయాలని ఆదేశించింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh pant) ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

''కొన్ని ఛానళ్లు మృతదేహాలు, రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫోటోలను బాగా దగ్గరుండి చూపిస్తున్నాయి. టీచర్లు పిల్లలను కొట్టే వీడియోలు, మహిళలు, చిన్నారులు, పెద్దలపై దాడుల ఫుటేజ్‌లను రిపీట్‌గా కూడా ప్రసారం చేస్తున్నాయి. బ్లర్రింగ్ చేయకుండానే చూపిస్తున్నాయి. ఇలా రిపోర్ట్ చేయడం బాధాకరమే కాకుండా, ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలకు విరుద్ధం. వీక్షకులను కూడా ఇవి కలవరపాటుకు గురిచేస్తాయి. చిన్నారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. బాధితుల గోప్యతకు కూడా భంగం కలుగుతుంది. ఇళ్లలో అన్ని వయసుల వారు కలిసి కూర్చుని టీవీ ప్రోగ్రామ్‌లు చూస్తుంటారు. దానిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన కథనాల విషయంలో బాధ్యతాయుతమైన ప్రసారాలు చేయాలి'' అని మంత్రిత్వ శాఖ ఈ అడ్వయిజరీలో పేర్కొంది. చాలాకేసుల్లో సోషల్ మీడియోలో నుంచి వీడియోలను తీసుకుని, ఎలాంటి సమీక్ష లేకుండా, సవరణలు చేయకుండా, ప్రోగ్రామ్ కోడ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ప్రసారం సాగిస్తున్నారని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

Updated Date - 2023-01-09T17:53:53+05:30 IST