Evil Nurse : ఏడుగురు పసికందులను చంపేసిన నర్స్.. భారత సంతతి డాక్టర్ కృషితో ఆ రాక్షసికి శిక్ష..

ABN , First Publish Date - 2023-08-19T10:38:18+05:30 IST

‘నేను రాక్షసి’ని అనుకుంటూ బ్రిటన్‌లో ఓ నర్స్ ఏడుగురు పసికందులను చంపేసింది. మరో ఆరుగురు నవజాత శిశువుల హత్యకు విఫలయత్నం చేసింది. ఆమె నేరాన్ని రుజువు చేయడంలో భారతీయ మూలాలుగల ఓ వైద్యుడు న్యాయస్థానానికి సహకరించారు.

Evil Nurse : ఏడుగురు పసికందులను చంపేసిన నర్స్.. భారత సంతతి డాక్టర్ కృషితో ఆ రాక్షసికి శిక్ష..
Lucy Letby, Dr Ravi Jayaram

లండన్ : ‘నేను రాక్షసి’ని అనుకుంటూ బ్రిటన్‌లో ఓ నర్స్ ఏడుగురు పసికందులను చంపేసింది. మరో ఆరుగురు నవజాత శిశువుల హత్యకు విఫలయత్నం చేసింది. ఆమె నేరాన్ని రుజువు చేయడంలో భారతీయ మూలాలుగల ఓ వైద్యుడు న్యాయస్థానానికి సహకరించారు. దీంతో ఆమె దోషి అని కోర్టు నిర్థారించింది, ఆమెకు శిక్షను సోమవారం ఖరారు చేయబోతోంది.

లూసీ లెట్‌బై (33) బ్రిటన్‌లోని చెస్టర్ హాస్పిటల్‌లో నర్సుగా పని చేస్తోంది. ఆమె తనను తాను రాక్షసిగా భావిస్తూ, ఏడుగురు పసికందులను హత్య చేసింది. పుట్టిన కొద్ది రోజుల్లోనే వారికి గాలి, ఇన్సులిన్‌లను ఇంజెక్ట్ చేసి, పాలు, ఫ్లూయిడ్స్ మితిమీరిన మోతాదులో ఎక్కించి చంపేసింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడినట్లు మాంఛెస్టర్ క్రౌన్ కోర్టు నిర్థరించింది. ఆమె దోషి అని తీర్పు చెప్పింది. ఆమెకు శిక్షను సోమవారం ఖరారు చేయబోతోంది.

లెట్‌బై మనస్తత్వాన్ని నిరూపించేందుకు పోలీసులు ఆమె చేతిరాతతో ఉన్న అనేక పత్రాలను కోర్టుకు సమర్పించారు. ‘‘నేను వారిని కాపాడేంత మంచిదానిని కాదు. కాబట్టి నేను వారిని చంపేశాను’’. ‘‘నేను రాక్షసిని, అందుకే ఈ పని చేశాను’’. ‘‘ఈ రోజు నీ పుట్టిన రోజు, నువ్విక్కడ లేవు. అందుకు చాలా సారీ’’ అని ఈ పత్రాల్లో ఉంది.


లూసీ లెట్‌బై నేరాలను రుజువు చేయడంలో సహాయపడినవారిలో ఒకరు డాక్టర్ రవి జయరామ్. ఆయన బ్రిటన్‌లో జన్మించిన భారతీయ మూలాలుగల వ్యక్తి. ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ, ముగ్గురు పసికందులు అనుమానాస్పదంగా మరణించడంతో తాను 2015లో లూసీ లెట్‌బై గురించి ఉన్నతాధికారులకు చెప్పానని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి 2017 ఏప్రిల్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ అనుమతి ఇచ్చిందన్నారు. తాను అప్రమత్తం చేసిన వెంటనే పోలీసులు, అధికారులు స్పందించి ఉంటే, వీరిలో కొందరిని కాపాడగలిగి ఉండేవారమని చెప్పారు.

పోలీసులు ఆమెను 2018 జూలైలో అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2015 నుంచి 2016 మధ్య కాలంలో చెస్టర్ హాస్పిటల్‌లోని నియోనాటల్ వార్డులో 13 మంది నవజాత శిశువులను చంపేందుకు ఆమె రకరకాల పద్ధతులను అవలంబించిందని గుర్తించారు. గాలి, పాలు, ఫ్లూయిడ్స్, ఇన్సులిన్ వంటివాటిని ఉపయోగించి, పసికందుల ప్రాణాలను తీసిందని గుర్తించారు. 2020 నవంబరులో ఆమెపై ఆరోపణలు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3: జాబిల్లిపై అడుగు పెట్టేందుకు సిద్ధం

Udyan Express : ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం..

Updated Date - 2023-08-19T10:38:18+05:30 IST