Karnataka Assembly Polls: ముచ్చటగా మూడో పెద్ద హామీ
ABN , First Publish Date - 2023-02-24T18:05:25+05:30 IST
కర్ణాటక(Karnataka)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Polls) సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ (Congress) ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని యత్నాలూ చేస్తోంది.
బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Polls) సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ (Congress) ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని యత్నాలూ చేస్తోంది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే అన్న భాగ్య స్కీమ్ (Anna Bhagya Scheme) కింద దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రజాధ్వని యాత్రలో అనేక మంది ప్రజలు తమను ఇదే కోరారని బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) తెలియజేశారు. ప్రస్తుత బీజేపీ(BJP) పాలనలో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం పేదలకు 5 కిలోల ఉచిత బియ్యం మాత్రమే పంపిణీ చేస్తోందని, అదే తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 7 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేశామని డీకే గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గృహలక్ష్మీ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద నెలకు 2వేల రూపాయలు చొప్పున ప్రతి కుటుంబంలోని ఒక మహిళకు ఇస్తామని హామీ ఇచ్చింది. దీనివల్ల కోటిన్నర మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు ప్రతి ఇంటికీ 200 యూనిట్ల కరెంట్ కూడా ఉచితంగా ఇస్తామని హామీ గుప్పించింది.
కర్ణాటకలో ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. బస్వరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కమలనాథులు విశ్వాసంగా ఉన్నారు. తాము అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు.