Share News

DK Shivakumar: కుమారస్వామి ఆఫర్‌పై శివకుమార్ రియాక్షన్.. తొందరలేదంటూ స్ట్రాంగ్ కౌంటర్

ABN , First Publish Date - 2023-11-05T20:30:37+05:30 IST

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రతిపక్ష పార్టీ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య చీలికలు తీసుకొచ్చేందుకు నానాతంటాలు...

DK Shivakumar: కుమారస్వామి ఆఫర్‌పై శివకుమార్ రియాక్షన్.. తొందరలేదంటూ స్ట్రాంగ్ కౌంటర్

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రతిపక్ష పార్టీ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య చీలికలు తీసుకొచ్చేందుకు నానాతంటాలు పడుతున్నాయి. ఆ ఇరువురి మధ్య విభేదాలు సృష్టించి.. తాము ప్రయోజనం పొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. కానీ.. వారి ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. ప్రతిసారి బెడిసికొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా మాజీ సీఎం కుమారస్వామి వేసిన కొత్త ప్లాన్ కూడా బోల్తా కొట్టేసింది. శివకుమార్‌ని ‘సీఎం’ పదవి ఆశ చూపి తనవైపుకు తిప్పుకుందామని ఆయన పన్నిన వ్యూహం.. ఒక్కసారిగా పటాపంచలైంది.

కుమారస్వామి ప్లాన్

జేడీ(ఎస్) పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమ కాంగ్రెస్‌లోకి చేరాలని అనుకుంటున్నారని.. ఇటీవల కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. దీనిపై కుమారస్వామి మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే, తన 19 మంది ఎమ్మెల్యేల మద్దతుపై ఆధారపడొచ్చని అన్నారు. అంటే.. తన పార్టీ ఫుల్ సపోర్ట్ ఇస్తుందని శివకుమార్‌కు ఆయన ఆఫర్ చేశారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతమున్న పరిస్థితిని చూస్తుంటే.. ఆ పార్టీలో ఎంతమంది సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారో తనకు తెలియదన్నారు. ఈ ప్రభుత్వాన్ని టీసీఎం (టెంపరరీ సీఎం), డీసీఎం (డూప్లికేట్ సీఎం) అని పిలవొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


డీకే శివకుమార్ కౌంటర్

కుమారస్వామి ఇచ్చిన 19 ఎమ్మెల్యేల ఆఫర్‌పై శివకుమార్ స్పందిస్తూ.. తనకు ముఖ్యమంత్రి కావాలన్న తొందరేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. సమిష్టి నాయకత్వంలో తాము అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కున్నామని, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం పదవిపై ఆసక్తి లేదన్న ఆయన.. అధిష్టానాన్ని కూడా డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. అధిష్ఠానం ఏం చెప్తే అది పాటిస్తామని, సిద్ధరామయ్యే తమ నేత అని తేల్చి చెప్పారు. ఇదే తమ నిబద్ధత అని చెప్పిన ఆయన.. సిద్ధరామయ్య కూడా పార్టీ హైకమాండ్ ఆదేశాల్ని పాటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యల దుమారం

ఇటీవల కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పిడి జరగనుందనే ప్రచారం జోరందుకుంది. కొన్ని రోజుల తర్వాత సీఎం బాధ్యతల్ని శివకుమార్‌ చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడ్డాయి. అదే సమయంలో.. అధిష్ఠానం ఆదేశిస్తే తాను సీఎం పదవి చేట్టేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే.. కుమారస్వామి పైవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ ఊహాగానాల్ని తోసిపుచ్చుతూ, ఆయనకు శివకుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీంతో.. అధికార మార్పిడి ఊహాగానాలు చెక్ పడినట్లయ్యింది.

Updated Date - 2023-11-05T20:30:38+05:30 IST