Wrestlers : మహిళా రెజ్లర్ల ఆరోపణలు.. బ్రిజ్ భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్‌ల నమోదు..

ABN , First Publish Date - 2023-06-02T13:01:36+05:30 IST

మహిళా రెజ్లర్ల ఫిర్యాదులపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

Wrestlers : మహిళా రెజ్లర్ల ఆరోపణలు.. బ్రిజ్ భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్‌ల నమోదు..

న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్ల ఫిర్యాదులపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)పై రెండు ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)లను, 10 ఫిర్యాదులను నమోదు చేశారు. తన లైంగిక వాంఛ తీర్చాలని ఆయన మహిళా రెజ్లర్లను డిమాండ్ చేశారని ఆరోపణలు నమోదు చేశారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో వీటిని నమోదు చేశారు.

బ్రిజ్ భూషణ్ లైంగిక వాంఛ తీర్చాలని కోరారనే ఆరోపణలపై రెండు ఎఫ్ఐఆర్‌లను, లైంగిక వేధింపుల ఆరోపణలపై 10 ఫిర్యాదులను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను అనుచితంగా ముట్టుకున్నారని, వారి ఛాతీపై చేతులు వేశారని, ఛాతీ నుంచి వీపువైపు తన చేతితో తడిమారని, వారిని వెంటాడారని ఈ ఫిర్యాదుల్లో ఆరోపించారు. ఈ ఫిర్యాదులు ఏప్రిల్ 21న నమోదయ్యాయని, రెండు ఎఫ్ఐఆర్‌లు ఏప్రిల్ 28న నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. ఈ ఆరోపణలు రుజువైతే దోషికి సుమారు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

ఆరుగురు ఒలింపియన్ల ఆరోపణల ఆధారంగా మొదటి ఎఫ్ఐఆర్‌ను, ఓ మైనర్ యొక్క తండ్రి ఫిర్యాదు మేరకు మరొక ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. తనను బ్రిజ్ భూషణ్ అనుచితంగా ముట్టుకున్నారని, తన భుజాలను గట్టిగా నొక్కారని ఈ మైనర్ ఆరోపించింది. ఫొటో తీసుకోవాలనే సాకుతో ఆయన తనను గట్టిగా పట్టుకున్నారని తెలిపింది. తనను ఫాలో అవవద్దని తాను బ్రిజ్ భూషణ్‌ను స్పష్టంగా కోరానని చెప్పింది.

రెజ్లర్ల ఆరోపణలు

తన భుజాలు, మోకాళ్లు, అరచేతులను సింగ్ అనుచితంగా ముట్టుకున్నారని ఓ రెజ్లర్ ఆరోపించారు. తన శ్వాస తీరును తెలుసుకునే నెపంతో తన ఛాతీని, పొట్టను అనుచితంగా ముట్టుకున్నట్లు తెలిపారు.

తన టీ-షర్ట్‌ను లాగి, తన ఛాతీపైన సింగ్ చేయి పెట్టారని మరో ఫిర్యాదుదారు ఆరోపించారు. తనను ఆయనవైపునకు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు.

తనను కౌగిలించుకుని, తనకు లంచం ఇవ్వజూపారని మరో రెజ్లర్ ఆరోపించారు. తాను వరుసలో నిల్చున్నపుడు తనను అనుచితంగా ముట్టుకున్నారని మరో రెజ్లర్ ఆరోపించారు.

రైతు సంఘాల మద్దతు

బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్న రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతు పలికాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఖాప్ పంచాయతీని నిర్వహించాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో గురువారం నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలోని సోరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ, తాము రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, వినతి పత్రం సమర్పిస్తామన్నారు. తదుపరి చర్యలను నిర్ణయించడం కోసం శుక్రవారం హర్యానాలోని కురుక్షేత్రలో మహా పంచాయతీని నిర్వహిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి :

Congress Vs BJP : ముస్లిం లీగ్ పూర్తి సెక్యులర్ పార్టీ : రాహుల్ గాంధీ

Congress : ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి.. 2024లో అనూహ్య ఫలితాలు.. : రాహుల్ గాంధీ

Updated Date - 2023-06-02T13:01:36+05:30 IST