Delhi : సుప్రీంకోర్టు తీర్పుపై కేజ్రీవాల్ హర్షం.. అధికారులకు హెచ్చరిక..

ABN , First Publish Date - 2023-05-11T16:56:26+05:30 IST

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ

Delhi : సుప్రీంకోర్టు తీర్పుపై కేజ్రీవాల్ హర్షం.. అధికారులకు హెచ్చరిక..
Arvind Kejriwal

న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం-ఢిల్లీ సర్వీసుల వివాదంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఇది చరిత్రాత్మక తీర్పు అని ప్రశంసించారు. దేశ రాజధాని నగరంలోని సర్వీసెస్‌పై కేంద్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2015లో జారీ చేసిన నోటిఫికేషన్‌‌పై మండిపడ్డారు.

కేజ్రీవాల్ గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తన చేతులను కట్టేసి, నీటిలో పడేసినప్పటికీ, తన నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి పనులు చేసిందన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలోని ఈ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు.

తాము దేశానికి సరికొత్త విద్యా విధానాన్ని అందించామన్నారు. ఇదివరకటి కన్నా 10 రెట్ల వేగంతో పనులు ఇకపై జరుగుతాయన్నారు. యావత్తు దేశానికి సమర్థ పరిపాలన నమూనాను ఢిల్లీ సమర్పిస్తుందన్నారు. రానున్న రోజుల్లో బ్యూరోక్రసీలో భారీ మార్పులు జరుగుతాయనే సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పనులకు ఆటంకాలు సృష్టించే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సమర్థులు, నిజాయితీపరులు, బాధ్యతాయుతంగా మెలిగేవారు, కారుణ్యంగలవారు ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం పొందుతారని చెప్పారు.

పరిపాలనా వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామన్నారు. మొత్తం వ్యవస్థ కుళ్లిపోయిందన్నారు. ప్రజలకు జవాబుదారీగా, బాధ్యతాయుతంగా ఉండే వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను త్వరలో కలుస్తానని, ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటానని చెప్పారు. యాంటీ కరప్షన్ బ్రాంచ్ గురించి విలేకర్లు అడిగినపుడు ఆయన స్పందిస్తూ, ఏసీబీ తన ప్రభుత్వ పరిధిలో లేదని, విజిలెన్స్ తన ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని చెప్పారు. సక్రమంగా పని చేయని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.

సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పులో, సర్వీసెస్‌పై శాసన, కార్యనిర్వాహక అధికారాలు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని తెలిపింది. ప్రజా భద్రత, పోలీసు, భూములపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు లేవని తెలిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి పరిపాలపై నియంత్రణ ఉండాలని తెలిపింది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం ప్రత్యేక లక్షణంగలదని తెలిపింది. సర్వీసెస్‌పై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు లేవని 2019లో జస్టిస్ అశోక్ భూషణ్ ఇచ్చిన తీర్పుతో ఏకీభవించడానికి తిరస్కరించింది.

ఇవి కూడా చదవండి :

Uddhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట

The Kerala Story:సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన కేరళ స్టోరీ టీమ్

Updated Date - 2023-05-11T17:34:47+05:30 IST