Opposition Unity: విపక్షాల ఐక్యతా సమావేశానికి హాజరుకానున్న కేజ్రీవాల్..?

ABN , First Publish Date - 2023-07-14T16:31:09+05:30 IST

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి విపక్షాల ఐక్యతా యత్నాలు ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ వచ్చేవారం ఏర్పాటు చేయనున్న విపక్షాల ఐక్యతా సమావేశంలో 'ఆప్' అధినేత కేజ్రీవాల్ పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం.

Opposition Unity: విపక్షాల ఐక్యతా సమావేశానికి హాజరుకానున్న కేజ్రీవాల్..?

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి విపక్షాల ఐక్యతా యత్నాలు (Opposition meeting) ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో(Bengaluru) కాంగ్రెస్ పార్టీ వచ్చేవారం ఏర్పాటు చేయనున్న విపక్షాల ఐక్యతా సమావేశంలో 'ఆప్' అధినేత కేజ్రీవాల్ (Arvind Kejriwal) పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. విపక్షాల ఐక్యతా సమావేశానికి 24కు పైగా విపక్ష పార్టీల నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి


విపక్షాల తొలి సమావేశం ఇటీవల బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగింది. 16 పార్టీలకు చెందిన 32 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్ పాల్గొన్నప్పటికీ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొనలేదు. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ రాలేదు. విపక్షాల ఐక్యతా సమావేశం ఉద్దేశం వేరని, ఆర్డినెన్స్‌పై డిబేట్ కోసం ఉద్దేశించినది కాదని కాంగ్రెస్ ప్రకటించింది. పార్లమెంటు సమావేశాల్లో ఆర్డినెన్స్‌ను బిల్లుకు తెచ్చే సమయంలో పార్టీ వైఖరి ప్రకటిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈనెల 17-18 తేదీల్లో బెంగళూరులో జరుగనున్న విపక్షాల రెండో సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.


కాగా, కొత్తగా రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (ఎం), విడుదలై చిరుతైగళ్ కట్చి, మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం, కేరళ కాంగ్రెస్ (జె), ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలు విపక్షాల ఐక్యతా సమావేశానికి మద్దతు ప్రకటించాయి. దీంతో బెంగళూరు సమావేశంలో 24కు పైగా పార్టీలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇచ్చిన ఆహ్వానం మేరకు విపక్షాల ఐక్యతా సమావేశంలో తాము పాల్గొంటున్నట్టు నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, జయంత్ జౌదరి, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, సంజయ్ రౌత్, లలన్ సింగ్, మనోజ్ ఝా, సీతారాం ఏచూరి, డి.రాజా, ఎన్‌.కె.ప్రేమ్‌చంద్రన్ ఇప్పటికే ప్రకటించారు.

Updated Date - 2023-07-14T16:31:09+05:30 IST