Earthquake Tragedy : టర్కీ, సిరియా భూకంపాల్లో మృతుల సంఖ్య 41 వేలు పైమాటే!

ABN , First Publish Date - 2023-02-15T15:22:14+05:30 IST

టర్కీ, సిరియా దేశాల్లో ఈ నెల 6న సంభవించిన భూకంపాల వల్ల దాదాపు 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Earthquake Tragedy : టర్కీ, సిరియా భూకంపాల్లో మృతుల సంఖ్య 41 వేలు పైమాటే!
Turkey Earthquake

న్యూఢిల్లీ : టర్కీ, సిరియా దేశాల్లో ఈ నెల 6న సంభవించిన భూకంపాల వల్ల దాదాపు 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళనకరం. వందేళ్లలో అత్యంత దారుణమైన ప్రకృతి వైపరీత్యం ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని 72 గంటల్లోగా గుర్తించగలిగితే, వారిని కాపాడవచ్చునని వైద్యులు చెప్తున్నారు. ఈ గడువు దాటిపోయినప్పటికీ, శిథిలాల క్రింద సజీవంగా ఉన్న పసికందులు, చిన్నారులు, వయోజనులు కనిపిస్తున్నారు.

టర్కీలో 35,000 మంది...

టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ (Recep Tayyip Erdogan) మంగళవారం ప్రకటించిన వివరాల ప్రకారం, ఆ దేశంలో ఈ నెల 6న సంభవించిన భూకంపాల కారణంగా సుమారు 35,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది వందేళ్ళలో అతి పెద్ద ప్రకృతి విలయం. 1939లో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 33,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎర్డోగాన్ పరామర్శించారు. కూలిన ఇళ్లనన్నిటినీ ఓ ఏడాదిలోగా పునర్నిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. అయితే 10 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. వీటి శిథిలాలనే ఇప్పటి వరకు తొలగించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ ఏడాదిలోనే వీటన్నిటినీ పునర్నిర్మిస్తామనే హామీని అమలు చేయడం సాధ్యం కాదని నిపుణులు చెప్తున్నారు.

దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు

టర్కీ దేశాధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు ఈ ఏడాది మే నెలలో జరగవలసి ఉంది. అయితే భూకంపాల నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బాధితుల రోదనలు

భూకంపాల బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రాణాలతో బయటపడగలిగినప్పటికీ, వారు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. మరోవైపు చలి తీవ్రంగా వేధిస్తోంది. నిత్యావసరాలు, బట్టలు, ఆశ్రయం, ఆహారం అందడం లేదు. తమ కళ్ళ ముందే అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుసుకుంటున్న ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.

సిరియాలో 5,800 మంది...

సిరియాలో దాదాపు ఓ దశాబ్దం నుంచి అంతర్యుద్ధం జరుగుతోంది. పుండు మీద కారం జల్లినట్లు భూకంపాలు వచ్చాయి. దానికి తోడు విపరీతమైన చలి కొరికేస్తోంది. అది చాలదన్నట్లు కలరా విజృంభిస్తోంది. ఈ ప్రభావం సహాయ కార్యకలాపాలపై పడుతోంది.

ఐక్య రాజ్య సమితి (United Nations) తాజా భూకంపాలు రావడానికి ముందు ఇచ్చిన నివేదికలో సిరియాలోని 1 కోటి 53 లక్షల మందికి మానవతావాద సాయం అవసరమని తెలిపింది. ఈ దేశంపై ఆంక్షలు అమలవుతుండటంతో సహాయ కార్యకలాపాలకు, నిత్యావసరాల సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తిరుగుబాటుదారుల పాలనలో ఉన్న సిరియాకు మంగళవారం సహాయ సామాగ్రి చేరింది. ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రాంతంలో కన్నా ఎక్కువ నష్టం ఇక్కడ జరిగింది. మొత్తం సిరియాలో దాదాపు 5,800 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఐక్య రాజ్య సమితి శరణార్థుల హై కమిషన్ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం, సిరియాలో భూకంపం వల్ల 88 లక్షల మంది ప్రభావితులయ్యారు. వీరికి మానవతావాద సాయం అందించడానికి రానున్న మూడు నెలలకు 397 మిలియన్ డాలర్లు అవసరం.

Updated Date - 2023-02-15T15:22:17+05:30 IST