Preneet Kaur: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. ప్రణీత్ కౌర్ బహిష్కరణ

ABN , First Publish Date - 2023-02-03T19:14:20+05:30 IST

పటియాల కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్

Preneet Kaur: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. ప్రణీత్ కౌర్ బహిష్కరణ

న్యూఢిల్లీ: పటియాల కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్‌(Preneet Kaur)ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్(Congress) అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీ(BJP)కి అనుకూలంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆమె పనిచేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా నుంచి నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)కి అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఆమెను పార్టీ క్రమశిక్షణ చర్యల కమిటీ (DAC) బహిష్కరించినట్టు కాంగ్రెస్ తెలిపింది.

ప్రణీత్ కౌర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, బీజేపీ అనుకూలంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ పేర్కొంది. ఆమెను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే, పార్టీ నుంచి ఆమెను ఎందుకు బహిష్కరించకూడదో మూడు రోజుల్లో చెప్పాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ప్రణీత్ కౌర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయని, ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసిందని ఆ పార్టీ నేత తారిక్ అన్వర్(Tariq Anwar ) పేర్కొన్నారు. ఆమెపై ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుందని, ఆమెకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినట్టు తెలిపారు.

ఎంపీ ప్రణీత్ కౌర్ భర్త, కెప్టెన్ అమరీందర్ సింగ్(Amarinder Singh) ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన నవంబరు 2021లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన సొంత కుంపటి పెట్టుకున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఆయన దారుణంగా ఓటమి పాలయ్యారు. ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు. స్వయంగా ఆయన కూడా ఓటమి పాలయ్యారు. గతేడాది సెప్టెంబరులో ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. కాగా, కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను మహారాష్ట్రకు గవర్నర్‌గా పంపాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-02-03T19:14:25+05:30 IST