Share News

Assembly polls 2023: కాంగ్రెస్ అంటేనే కుటుంబ పాలన: మోదీ

ABN , First Publish Date - 2023-11-20T14:23:42+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అవినీతి, బుజ్జగింపు రాజకీయాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనే ఆ పార్టీకి ముఖ్యమని అన్నారు. ఈనెల 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాజస్థాన్‌లోని పాలిలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.

Assembly polls 2023: కాంగ్రెస్ అంటేనే కుటుంబ పాలన: మోదీ

పాలి: కాంగ్రెస్ పార్టీ అవినీతి, బుజ్జగింపు రాజకీయాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనే ఆ పార్టీకి ముఖ్యమని అన్నారు. ఈనెల 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP)కి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాజస్థాన్‌ (Rajasthan)లోని పాలిలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమని అన్నారు. 21వ శతాబ్దంలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడంలో రాజస్థాన్ పాత్ర కీలకమని చెప్పారు. దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాభివృద్ధి నిలిచిపోయిందన్నారు. బుజ్జగింపు రాజకీయాల కారణంగా గత ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోని విషయాన్ని ప్రజలు గమనించారని అన్నారు.


మహిళలపై నేరాల విషయంలో రాజస్థాన్‌ను కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ చేసిందని మోదీ ఆరోపించారు. మహిళలు చేసిన ఫిర్యాదులన్నీ అబద్ధాలని సీఎం చెబుతుంటారని, మన దేశంలో మహిళలు నకిలీ కేసులు నమోదు చేయడం ఎప్పుడైనా ఉందా? అని ప్రధాని ప్రశ్నించారు. ఇది మహిళలను అవమానించడం కాదా అని అన్నారు.


''ఈ రోజు దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు అంతా కష్టపడి పనిచేస్తున్నాం. ఇందుకోసం రాజస్థాన్‌లో అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం అవసరం. కాంగ్రెస్ పార్టీకి అవినీతి, కుటుంబ రాజకీయాలే ముఖ్యం. కేవలం బుజ్జగింపు రాజకీయాలకే ఆ పార్టీ పరిమితమవుతుంటుంది'' అని మోదీ విమర్శించారు. పొరుగు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, అక్కడ లీటర్ పెట్రోల్ రూ.97 అని, రాజస్థాన్‌లో మాత్రం హెచ్చు ధరకు పెట్రోల్ అమ్ముతారని అన్నారు. బీజేపీకి అధికారమిస్తే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తామని, పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగిస్తామని హామీ ఇచ్చారు.


రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 25న జరుగనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 స్థానాలకు గాను కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుంది, బీజేపీ 73 సీట్లకు పరిమితమైంది. బీఎస్‌పీ, స్వతంత్ర అభ్యర్ధుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఏర్పాటైంది.

Updated Date - 2023-11-20T14:23:43+05:30 IST