Maharashtra NCP crisis: సీఎంను తొలగించడం ఖాయం... కొత్త సీఎం ఎవరో చెప్పిన సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2023-07-03T14:31:54+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు త్వరలోనే ఉద్వాసన పలకడం ఖాయమని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆదివారంనాడు శివసేన-బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్‌ సీఎం స్థానంలోకి వస్తారని అన్నారు.

Maharashtra NCP crisis: సీఎంను తొలగించడం ఖాయం... కొత్త సీఎం ఎవరో చెప్పిన సంజయ్ రౌత్

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)కు త్వరలోనే ఉద్వాసన పలకడం ఖాయమని శివసేన ఉద్ధవ్ థాకరే (Shiv Sna-UBT) వర్గం నేత సంజయ్ రౌత్ (Sanajay Raut) జోస్యం చెప్పారు. ఆదివారంనాడు శివసేన-బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్‌ సీఎం స్థానంలోకి వస్తారని అన్నారు.

''ఈ రోజు నేను కెమెరా ముందు చాలా స్పష్టంగా చెబుతున్నాను. మహారాష్ట్ర సీఎం మార్పు జరగనుంది. ఏక్‌నాథ్ షిండేను తొలగించనున్నారు. షిండేతో పాటు ఆయన వర్గం 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుంది'' అని మీడియాతో సోమవారంనాడు మాట్లాడుతూ సంజయ్ రౌత్ చెప్పారు. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లను బీజేపీ చీల్చిందని, కానీ వాళ్లకు ఎంతమాత్రం ప్రయోజనం చేకూరదని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో తామంతా సమష్టిగా పోరాడతామని చెప్పారు. ఎన్‌సీపీ నేతలు అవినీతిలో చిక్కుకున్నారని ప్రధాని మోదీ చెప్పిన నేతలంతా ఇప్పడు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయడం దిగ్భాంతి కలిగిస్తోందన్నారు. ఈ పరిణామలన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ఈ తరహా రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు ఇష్టపడరని, ఒక్కనాటికి కూడా మద్దతివ్వరని చెప్పారు.

దాదర్ పోస్టర్లపై...

ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే కలిసి పనిచేయాలంటూ దాదర్‌లో వెలిసిన పోస్టర్లపై మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ రౌత్ సమాధానమిస్తూ, మహారాష్ట్ర ప్రజలు ఎప్పుడూ తమతోనే ఉన్నారని, తమతోనే ఉంటారని అన్నారు.

Updated Date - 2023-07-03T14:31:54+05:30 IST