Share News

CM Siddaramaiah: మా గ్యారెంటీలతో బీజేపీలో వణుకు.. తెలంగాణలో కాంగ్రెస్‏దే విజయం

ABN , First Publish Date - 2023-11-29T12:39:55+05:30 IST

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న నిరాశ నిస్పృహల్లో బీజేపీ నేతలు ఉన్నారని, ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ సహా

CM Siddaramaiah: మా గ్యారెంటీలతో బీజేపీలో వణుకు.. తెలంగాణలో కాంగ్రెస్‏దే విజయం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న నిరాశ నిస్పృహల్లో బీజేపీ నేతలు ఉన్నారని, ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ సహా ఆ పార్టీ నేతలు తమ ప్రభుత్వ గ్యారెంటీ పథకాల విజయాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సోషల్‌మీడియాలో ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదన్నర సంవత్సరాల పరిపాలనలో కేవలం 10శాతం హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజలను కులాలు, మతాలవారీగా విభజించే అంశాలపై ఉన్నంత ఆసక్తి సంక్షేమ పథకాలపై లేదని చురకలంటించారు. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గాలులు బలంగా వీస్తున్నాయని, సహజంగానే ఈ పరిణామం ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతలకు వణుకు పుట్టిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కర్ణాటక విజయాలు చెప్పుకోవడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రధాని మోదీ ప్రజాదరణ నానాటికీ క్షీణిస్తోందన్నారు. మోదీ, అమిత్‌ షా జంట సొంతపార్టీలోని నేతలను ఎదగనివ్వకుండా తొక్కేస్తోందని సీఎం పేర్కొన్నారు. కార్యకర్తల్లోనూ భ్రమలు తొలగిపోతున్నాయన్నారు. తెలంగాణలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-11-29T12:39:57+05:30 IST