Share News

Assembly polls 2023: మోదీకి వీడియోతో సమాధానం చెప్పిన సీఎం

ABN , First Publish Date - 2023-11-24T14:29:49+05:30 IST

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం సీఎం అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ మధ్య గొడవలున్నాయంటూ ప్రధాన మంత్రి నరేంద్ర ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను గెహ్లాట్ శుక్రవారంనాడు తిప్పికొట్టారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలంటూ సచిన్ పైలట్ ఓటర్లకు పిలుపినిచ్చిన వీడియోను ఆయన సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు.

Assembly polls 2023: మోదీకి వీడియోతో సమాధానం చెప్పిన సీఎం

జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య గొడవలున్నాయంటూ ప్రధాన మంత్రి నరేంద్ర ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను గెహ్లాట్ శుక్రవారంనాడు తిప్పికొట్టారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలంటూ సచిన్ పైలట్ ఓటర్లకు పిలుపినిచ్చిన వీడియోను ఆయన సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు. ఈనెల 25వ తేదీ శనివారంనాడు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.


రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో సీఎం, మాజీ డిప్యూటీ సీఎం మధ్య గొడవల వ్యవహారాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. ప్రధాని మోదీ సైతం ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడంతో కాంగ్రెస్ ఏకతాటిపై ఉందనే సంకేతాలనిస్తూ సీఎం ఈ వీడియో విడుదల చేశారు. పైలట్ 1.51 నిమిషాల పాటు ఈ వీడియోలో మాట్లాడారు.


పైలట్ వీడియో సందేశం

పార్టీకి వచ్చిన సమాచారం, ప్రజాభిప్రాయం, ఓటర్ల సెంటిమెంట్‌ను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రానుందనే విషయం స్పష్టమవుతోందని, ప్రజలందరూ కాంగ్రెస్‌కు బాసటగా నిలవాలని పైలట్ ఆ వీడియోలో కోరారు. ''ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము వందలాది సమావేశాలు జరిపాం. ఎంతో ప్రయత్నించినప్పటికీ కొన్ని ప్రాంతాలకు వెళ్లలేకపోయాం. వారందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసికట్టుగా అందరూ ముందుకు వెళ్దాం. అన్ని విషయాలు పక్కనపెట్టి హస్తం గుర్తు బటన్‌ను ప్రెస్‌ చేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి'' అని పైలట్ కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను నిలిపివేయాలనే బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.


దీనికి ముందు, సచిన్ పైలట్, ఆయన తండ్రి రాజేష్ పైలట్‌ను కాంగ్రెస్ పార్టీ వాడుకుని, ఆ తర్వాత పక్కనపెట్టేసిందంటూ ప్రధాని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన గుజరాత్ బిడ్డను (రాజేష్ పైలట్) రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో రాగానే పాలలో పడిన ఈగను తొలగించినట్టు పక్కనపెట్టేసిందని అన్నారు. రాజేష్ పైలట్ తనయుడి (సచిన్ పైలట్) విషయంలోనూ ఇదే జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్జార్లను ఇప్పుడే కాదు, గతంలోనూ అవమానపరిచిందని విమర్శించారు.

Updated Date - 2023-11-24T14:33:31+05:30 IST