Chhatrapati Shivaji : ‘శ్రేష్ఠ భారత్’కు స్ఫూర్తి ప్రదాత ఛత్రపతి శివాజీ మహారాజు : మోదీ

ABN , First Publish Date - 2023-06-02T14:14:40+05:30 IST

ఛత్రపతి శివాజీ మహారాజు బానిస మనస్తత్వాన్ని అంతం చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Chhatrapati Shivaji : ‘శ్రేష్ఠ భారత్’కు స్ఫూర్తి ప్రదాత ఛత్రపతి శివాజీ మహారాజు : మోదీ
Narendra Modi

న్యూఢిల్లీ : ఛత్రపతి శివాజీ మహారాజు (Chatrapati Shivaji Maharaj) బానిస మనస్తత్వాన్ని అంతం చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. ‘ఒక భారత దేశం-శ్రేష్ఠ భారత దేశం’ దార్శనికతకు శివాజీ ఆలోచనలు నేటికీ ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. ఛత్రపతి శివాజీ 350వ సామ్రాజ్య పట్టాభిషేక ఉత్సవాల సందర్భంగా మోదీ మాట్లాడారు.

ఛత్రపతి శివాజీ మహారాజు ధైర్య, సాహసాల దిక్సూచి అని మోదీ చెప్పారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటికీ మన దేశానికి ప్రేరణగా నిలుస్తాయన్నారు. ‘ఒక భారత దేశం-శ్రేష్ఠ భారత దేశం’ దార్శనికత (Vision)లో ఆయన ఆలోచనలను చూడవచ్చునని తెలిపారు. ఆయన నేటికీ మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటారని తెలిపారు. స్వయంపాలనను మనకు చూపించారన్నారు. బానిస మనస్తత్వానికి తెర దించారన్నారు. శివాజీ గొప్ప సైనికుడు మాత్రమే కాకుండా గొప్ప పరిపాలకుడని చెప్పారు. ‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’ విజన్‌లో ఆయన సిద్ధాంతాలను చూడవచ్చునని తెలిపారు.

ఛత్రపతి శివాజీ మహారజు సామ్రాజ్య పట్టాభిషేక ఉత్సవాలను మహారాష్ట్రలో ఓ పండుగ మాదిరిగా జరుపుకుంటారని చెప్పారు. ఆయనకు పట్టాభిషేకం జరిగినపుడు స్వరాజ్య నినాదాలు ప్రతిధ్వనించాయన్నారు. జాతీయవాదం పెట్టుబికిందన్నారు. నూతన శక్తి, నూతన చైతన్యం వచ్చాయని తెలిపారు.

ఆ కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేకం అద్భుత ఘట్టమని తెలిపారు. ఆయన పాలనలో దేశ క్షేమం, ప్రజా సంక్షేమం ప్రధానాంశాలని తెలిపారు. శివాజీ మహారాజు ఇచ్చిన స్ఫూర్తితో భారత నావికా దళాన్ని బానిస గుర్తుల నుంచి విముక్తి చేశామని చెప్పారు. బ్రిటిష్ పరిపాలనకు సంబంధించిన గుర్తులను తొలగించి, శివాజీ రాజ ముద్రను వేశామని చెప్పారు.

వందల సంవత్సరాల బానిసత్వం మన దేశ ప్రజల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాలను పోగొట్టిందన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని నింపడం ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉండేదన్నారు. కానీ ఛత్రపతి శివాజీ ఆ రోజుల్లో దండయాత్రకు వచ్చినవారితో పోరాడటం మాత్రమే కాకుండా, స్వయంపాలన సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో నింపారని చెప్పారు. దేశ నిర్మాణం పట్ల ఆయనకు సమగ్ర దార్శనికత ఉందన్నారు. ఆయన స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా సుపరిపాలనను కూడా అందించారని చెప్పారు. ఆయన పరిపాలన తీరు, విధానాలు నేటికీ తగినవేనని చెప్పారు. ఆయన నావికా దళాన్ని విస్తరించిన తీరు నేటికీ మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. అనేక సంవత్సరాలు గడచిపోయినప్పటికీ, ఆయన స్థాపించిన విలువలు నేటికీ మనకు దారి చూపుతాయన్నారు. ఈ విలువల ఆధారంగా మనం 25 ఏళ్ల అమృత కాలాన్నిపూర్తి చేయాలన్నారు. ఆయన కన్న కలల భారత దేశంగా తీర్చిదిద్దడమే ఈ ప్రస్థానం లక్ష్యమని తెలిపారు. స్వరాజ్యం, సుపరిపాలన, ఆత్మవిశ్వాసంతో ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత దేశంగా తీర్చిదిద్దడానికే ఈ ప్రయాణమని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Congress Vs BJP : ముస్లిం లీగ్ పూర్తి సెక్యులర్ పార్టీ : రాహుల్ గాంధీ

Congress : ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి.. 2024లో అనూహ్య ఫలితాలు.. : రాహుల్ గాంధీ

Updated Date - 2023-06-02T14:14:40+05:30 IST