Chandrababu Naidu: నేను విజన్ 2020 అంటే 420 అన్నారు.. నేడు ప్రపంచంలో తెలుగు ఐటీ నిపుణులదే హవా
ABN , First Publish Date - 2023-12-29T10:24:08+05:30 IST
నేడు తెలుగుజాతి ప్రజలు ప్రపంచంలోనే ఉన్నత స్థానాలు సాధించగలుగుతున్నారని, తన విజయాలు భావితరాలు గుర్తుంచుకోవాలన్నదే తన ఆశయమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అభి ప్రాయపడ్డారు.
- సదవులు, డబ్బు కాదు.. భావితరాలు నా త్యాగాన్ని గుర్తించాయి
- నా శేష జీవితం తెలుగుగడ్డ కోసమే..
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నేడు తెలుగుజాతి ప్రజలు ప్రపంచంలోనే ఉన్నత స్థానాలు సాధించగలుగుతున్నారని, తన విజయాలు భావితరాలు గుర్తుంచుకోవాలన్నదే తన ఆశయమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అభి ప్రాయపడ్డారు. నగరంలోని వైట్‌ఫీల్డ్ కేఎంఎం రాయల్ కన్వెన్షన్ సెంటర్‌లో బెంగళూరు తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో గురువారం చంద్రబాబుకు ఆత్మీయ సన్మానం జరిగింది. చంద్రబాబు రాక కోసం బెంగళూరుతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రవాసాంధ్రులు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ నుంచి హెచ్‌ఏఎల్‌కు ప్రత్యేక విమానంలో చేరుకున్న చంద్రబాబు అక్కడనుంచి నేరుగా కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చారు. అక్కడ భారీగా చేరిన అభిమానులు చంద్రబాబును సాదరంగా స్వాగతించారు. అనంతరం వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలు చల్లి నివాళి అర్పించారు. అనంతరం భారీగా హాజరైన అభిమానులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ‘నాకు కష్టం వచ్చినప్పుడు బెంగళూరులో ఎంతోమంది మద్దతుగా పోరాటాలు చేశారని, నిరసనలో పాల్గొన్నారని వారందరికీ నా ధన్యవాదాలన్నారు. ఏ నాయకుడికి ఇటువంటి ఆదరణ ఉండదని అందరికీ నా ధన్యవాదాలన్నారు. తెలుగువారు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదని, బెంగళూరు నగరాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారన్నారు. ఏపీ, తెలంగాణలలోనే కాకుండా బెంగళూరు, చెన్నైల్లో తెలుగువారు సమర్థవంతంగా రాణిస్తున్నారని ఇది మనందరి గర్వకారణమన్నారు. ప్రపంచమంతటా తెలుగువారి ప్రభావం పెరిగిందన్నారు. రైతుబిడ్డగా జన్మించి ఐటీ ద్వారా ఎంతో అభివృద్ధిని సుసాధ్యం చేశానన్నారు. సమాజాన్ని పరిశీలిస్తే ఎడ్లబండి నుంచి డ్రైవర్‌లేని కారు దాకా ప్రగతి, సాంకేతిక విప్లవానికి నాంది అన్నారు. బెంగళూరుతోపాటు ఐటీని అభివృద్ధి చేయాలని భావిస్తే ఎందరో ఎగతాళి చేశారని నేడు హైదరాబాద్ ఐటీతోపాటు ఫార్మా, బయోటెక్‌లు విస్తారంగా అభివృద్ధి చెందాయన్నారు. అన్ని పరిశ్రమలకు ఐటీ రంగం వెన్నెముకలాంటిదన్నారు. నేను భారతదేశం గొప్పగా ఉండాలని భావించాను, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ క ల్పించినందుకే మహిళా సాధికారత సాధ్యమయ్యిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ అన్నింటా భ్రష్టు
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయని, సంకల్పంతో సాధించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రవాసాంధ్రులు, ఆంధ్రప్రదేశ్‌కోసం వందరోజుల ప్రణాళికతో పని చేయాలన్నారు. ఏపీ భవిష్యత్తు తీర్చే బాధ్యత మీదే, షార్ట్ యాక్షన్‌ప్లాన్ చేసుకోవాలన్నారు.
మీ స్ఫూర్తితోనే బీటీఎఫ్ అభివృద్ధి : కనకమేడల వీర
దశాబ్దాలకాలంగా క్రమశిక్షణ, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తున్న మీ స్ఫూర్తితోనే బెంగళూరు దేశం ఫోరం (బీటీఎఫ్) ఏర్పాటు చేశామని, నిరంతరం మీ వెంటే ఉంటూ సమాజానికి సేవలందిస్తున్నామని ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కనకమేడల వీర వెల్లడించారు. ప్రారంభంలో ఫోరం కొంత తడబడినా దశాబ్దకాలంగా నిరంతరంగా పార్టీకోసం పనిచేస్తోందన్నారు. సైకో పాలనలో కేసులకు భయపడకుండా పనిచేస్తున్నామన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మీ దిశానిర్దేశంతో అనేక కార్యక్రమాలు చేశామన్నారు. అమరావతి భూమి వేళ బెంగళూరు నుంచి సైకిల్ యాత్ర చేశామని, ఫోరం ఐదేళ్ల సందర్భంగా నవ్యాంధ్రప్రగతిపై భారీ సభ జరిపామన్నారు. ఇటీవలే సమరశంఖారావం సభ విజయవంతం చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మన పార్టీ అధికారంలో లేకున్నా కంచర్ల శ్రీకాంత్, రాంభూల్‌రెడ్డిలు ఎమ్మెల్సీగా గెలిచేందుకు బెంగళూరు నుంచి శ్రీకారం చుట్టామని, సభ్యత్వ నమోదు, పోలింగ్ కోసం అహర్నిశలు పనిచేశామని ఇదే ప్రణాళిక, 2024 శాసనసభ ఎన్నికల్లోనూ అమలు చేస్తామన్నారు. బెంగళూరులో పార్టీ కార్యాలయం కోసం సుబ్రమణ్యం అనే దాత భవనం ఇచ్చారని ప్రకటించారు. ఇక్కడనుంచే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాలు, పార్లమెంటు స్థాయి, జోనల్, ప్రాంతాల సదస్సులు జరుపుతున్నామన్నారు. బెంగళూరులోని 14 ప్రాంతాలకు సంబంధించిన తెలుగు ప్రజలకోసం ఇక్కడ సభలు నిర్వహిస్తున్నామన్నారు. మీ మార్గదర్శకంతో మా సొంతూళ్లలో పార్టీ అభివృద్ధి, ఓటరు నమోదు వంటి ప్రణాళికలు ఇక్కడనుంచే అమలు చేస్తున్నామని వివరించారు. ఫోరం యాక్షన్‌ప్లాన్‌పై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేసి వారందరినీ ప్రత్యేకంగా అభినందించారు. వారితో ప్రత్యేకంగా ఫొటోలు తీసుకున్నారు. చంద్రబాబు వెంట మాజీ మం త్రి అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తదితరులు ఉన్నారు.

కుప్పం త్రిలోక్‌ను పరామర్శించిన చంద్రబాబు
కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు త్రిలోక్‌ను చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల కుప్పంలో నిరసన చేస్తున్న సమయంలో త్రిలోక్ గాయపడ్డాడు. ప్రస్తుతం బెంగళూరులోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న త్రిలోక్‌నుపరామర్శించారు.
విప్లవాత్మకంగా డిజిటల్ రంగం
2020 విజన్‌కు పిలుపునిస్తే 420 అన్నారని, కానీ డిజిటల్ రంగంతో ఎన్నో చారిత్రక విప్లవాలకు సాంకేతికత తోడైందన్నారు. నవశకం తెలుగురాష్ట్రానికి సొంతం కావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజం తన ఆశయమన్నారు. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంతో రోడ్లు, ఎయిర్‌పోర్ట్‌లు అభివృద్ధి చేశానని తద్వారా సంపద పెరిగిందని, రానున్న రోజుల్లో పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ కానుందన్నారు. సంపద శ్రీమంతులకే వరం కారాదని, ప్రజలందరికీ చేరాలని, ప్రతి కుటుంబానికి శక్తిని ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
కదలివచ్చిన అభిమానులు
చంద్రబాబు బెంగళూరు పర్యటనలో అభిమానం వెల్లువెత్తింది. వేలాదిమంది ప్రియతమ నేతను చూసేందుకు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలకంటే ధీటుగా రోడ్లకు ఇరువైపులా భారీగా జనం చేరి చంద్రబాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సభాప్రాంగణం వద్ద చంద్రబాబును దగ్గరగా చూసేందుకు వేలాదిమంది తరలిరావడంతో తోపులాట జరిగింది. ఒకదశలో పోలీసులు లాఠీచార్జ్ చేసి కట్టడి చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రసంగిస్తున్నంతసేపు కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు. సీబీఎన్ జిందాబాద్ అన్నారు. ఏపీలో అరాచక పాలన అంతం కావాలని పలువురు ప్లకార్డులు ప్రదర్శించారు.
బెంగళూరు టీడీపీ ఫోరం ఘన సత్కారం
చంద్రబాబు నాయుడును బెంగళూరు టీడీపీ ఫోరం ఘనంగా సత్కరించింది. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కనకమేడల వీర, సోంపల్లి శ్రీకాంత్, పవన్ మోటుపల్లి, వంశీ మన్యం, శివా చినుమోలు, కేశవ్, వెంకటరత్నం, విజయ్, విష్ణు, పాండులు ప్రత్యేకంగా సత్కరించారు. చంద్రబాబు ప్రసంగంలోనూ వీరి పేర్లను ప్రస్తావించి ప్రశంసించారు. జీజేఎం చారిటబుల్ ట్రస్టు చైర్మన్, చిత్తూరు పార్టీ నేత గురజాల జగన్ మోహన్ భారీ గజమాలతో చంద్రబాబును సత్కరించారు. బెల్లం రమణ చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.