BJP : బీజేపీ అధ్యక్ష పదవిపై జాతీయ కార్యవర్గం సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2023-01-17T16:56:34+05:30 IST
మోదీ ( Narendra Modi), జేపీ నడ్డా (JP Nadda)ల నాయకత్వంలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా జేపీ నడ్డా (JP Nadda) పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగిస్తూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆయన నేతృత్వంలో పార్టీ బలపడినట్లు పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు నడ్డాల నేతృత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోగలమనే ధీమాను వ్యక్తం చేసింది.
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ, తమ పార్టీ జాతీయ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించినట్లు తెలిపారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల వరకు పార్టీ జాతీయ అధ్యక్షునిగా నడ్డా కొనసాగుతారని చెప్పారు. నడ్డా నాయకత్వంలో తాము బిహార్‌లో అత్యధిక స్ట్రైక్ రేటును సాధించామని, మహారాష్ట్రలో ఎన్డీయే విజయం సాధించిందని, ఉత్తర ప్రదేశ్‌లో తాము గెలిచామని, పశ్చిమ బెంగాల్‌లో తమ బలం పెరిగిందని చెప్పారు. అంతే కాకుండా గుజరాత్‌లో భారీ విజయాన్ని సాధించామని తెలిపారు.
మోదీ ( Narendra Modi), జేపీ నడ్డా (JP Nadda)ల నాయకత్వంలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఎంపీ స్థానాల కన్నా ఎక్కువ స్థానాలు తమకు లభిస్తాయని చెప్పారు.
సోమవారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ కీలక సమావేశంలో మోదీ, అమిత్ షాలతోపాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 9 రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరుగుతాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకమైనవి.
2019లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నడ్డా 2020లో పూర్తి కాలపు అధ్యక్ష పదవిని చేపట్టారు. అందరూ ఊహించినట్లుగానే ఆయనను ఆ పదవిలో కొనసాగిస్తూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది.