Karnataka polls: ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ!.. రాష్ట్రంలో లింగాయత్ జనాభాపై ప్రభావం?
ABN , First Publish Date - 2023-02-19T17:08:21+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
బెంగళూరు: కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ(BJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ కార్యదర్శి, కర్ణాటక ఎమ్మెల్యే సీటీ రవికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న హెచ్‌డీ తమ్మయ్య (HD Thammaiah) తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 18 సంవత్సరాలుగా బీజేపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని వందమంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు చిక్‌మంగళూరు టికెట్ ఇవ్వకపోవడంతో తమ్మయ్య అలకబూనారు. చివరకు కమలంతో దోస్తీకి గుడ్‌బై చెప్పి హస్తం పార్టీతో చేతులు కలిపారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప అనుచరుడు, మరో బీజేపీ సీనియర్ నేత కిరణ్ కుమార్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. కర్ణాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చిక్కనాయకనహల్లి నియోజకవర్గం నుంచి కిరణ్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే తనకు టికెట్ దక్కదని తేలిపోవడంతో ఆయన కూడా బీజేపీకి రాజీనామా చేశారు. లేఖను ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్పకు పంపారు. కిరణ్ కుమార్ సదర్ లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఎన్నికల్లో ఆయన రాజీనామా ప్రభావం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. చాలామంది బీజేపీ నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, బీజేపీకి చెందిన ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నారని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) చెప్పారు. బీజేపీ నేతలంతా కర్ణాటకలో మార్పు కోరుకుంటున్నారని, అవినీతి పాలననుంచి విముక్తి కోరుకుంటున్నారని డీకే చెప్పారు.
ఎన్నికలకు ముందు కర్ణాటక కాంగ్రెస్‌ను ముప్పుతిప్పలుపెడుతున్న సమస్య ఇదీ..
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతా సానుకూలంగా ఏమీ లేదు. అధిష్టానం హెచ్చరించినా లెక్కచేయకుండా కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తున్నారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బైరాతి సురేశ్ సిద్ధరామయ్య సేవలను కొనియాడారు. ఎల్‌బుర్గలో సంగోల్లి రాయన్న విగ్రహావిష్కరణ సభలో ఆయన ఏకంగా కురవ సామాజిక నేతలతో వేదికపైనే వాగ్వాదానికి దిగారు కూడా.