Share News

BJP: బాణసంచా కాల్చడంతోనే కాలుష్యం పెరిగిందనడం సిగ్గుచేటు.. ఆప్‌పై మండిపడ్డ బీజేపీ

ABN , First Publish Date - 2023-11-13T18:36:08+05:30 IST

బాణసంచా కాల్చడంతోనే ఢిల్లీలో వాయు నాణ్యత తగ్గిందని చెప్పడం సిగ్గుచేటని బీజేపీ ఉపాధ్యక్షుడు కపిల్ మిశ్రా(Kapil Mishra) అన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) గత వారం నుంచి 500 పాయింట్లుగా నమోదైతే.. దీపావళి తరువాత కేవలం 296 పాయింట్లే నమోదైందని తెలిపారు.

BJP: బాణసంచా కాల్చడంతోనే కాలుష్యం పెరిగిందనడం సిగ్గుచేటు.. ఆప్‌పై మండిపడ్డ బీజేపీ

ఢిల్లీ: బాణసంచా కాల్చడంతోనే ఢిల్లీలో వాయు నాణ్యత తగ్గిందని చెప్పడం సిగ్గుచేటని బీజేపీ ఉపాధ్యక్షుడు కపిల్ మిశ్రా(Kapil Mishra) అన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) గత వారం నుంచి 500 పాయింట్లుగా నమోదైతే.. దీపావళి తరువాత కేవలం 296 పాయింట్లే నమోదైందని తెలిపారు. దీపావళి రోజు టపాసులు కాల్చేలా బీజేపీ ప్రజల్ని ప్రోత్సహిస్తోందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్(Gopal Roy) విమర్శించారు. కాలుష్య నియంత్రణపై ఆపార్టీకి శ్రద్ధ లేదని అన్నారు. ఈ కామెంట్లపై స్పందించిన కపిల్ మిశ్రా.. "దీపావళి రోజు నగరంలో పటాకుల నిషేధాన్ని పాటించనందుకు ఢిల్లీ వాసులను చూసి గర్విస్తున్నా. ఇది స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి ప్రతీక. టపాసుల(Crackers) నిషేధం అశాస్త్రీయం, నియంతృత్వం. నిషేధాన్ని ప్రజలు ధైర్యంగా ధిక్కరించారు. బాణసంచా కాల్చడమే కాలుష్యానికి కారణమైతే ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తున్న గాజా ప్రపంచంలోనే అత్యధిక కలుషితమైన నగరంగా మిగిలేది.

కాలుష్యంతో పోరాడండి కానీ పిల్లల టపాసులతో కాదు" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీపావళి తర్వాత కాలుష్యం పెరగడానికి నగరంలో పటాకులు కాల్చడమే కారణమని గోపాల్ రాయ్ చేసిన వ్యాఖ్యలను మిశ్రా తప్పుబట్టారు.ఓ వైపు ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టే మార్గాల్ని అన్వేషించమని సుప్రీంకోర్టు చెబితే.. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కాలుష్యం పెరిగేలా బీజేపీ(BJP) నేతలు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. పండుగల సమయంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కలుషితం చేసే బాణసంచాపై నిషేధం ఉన్నప్పటికీ అన్ని చోట్ల దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

నిషేధం ఉన్నప్పటికీ దీపావళి రోజు పటాకులు కాల్చేందుకు ఉత్తరప్రదేశ్, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాలు ఎలా అనుమతినిచ్చాయని రాయ్ ప్రశ్నించారు. ‘‘ఈ రోజు కాలుష్యం పెరిగిందంటే బాణాసంచా కాల్చడం వల్లే. సుప్రీంకోర్టు ఆదేశించినా బీజేపీ తన బాధ్యతను నెరవేర్చకపోవడం దురదృష్టకరం. బాణాసంచా కాల్చాలని బీజేపీ ప్రజలకు సూచించింది. మూడు రాష్ట్రాల్లో (ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌) పోలీసులు ఆ పార్టీ వెంటే ఉన్నారు’’ అని ఆరోపించారు. ఢిల్లీలో గడిచిన ఎనిమిదేళ్లలో దీపావళి తరువాత తక్కువ వాయు కాలుష్యం నమోదవడం ఇదే తొలిసారి. కానీ.. ఇవాళ సాయంత్రం నాటికి కాలుష్యస్థాయిలు మళ్లీ పెరిగిపోయాయి.


టీఎంసీ ఫైర్..

కపిల్ మిశ్రా కామెంట్లపై టీఎంసీ(TMC) నేత సాకేత్ గోఖలే మండిపడ్డారు. "బీజేపీ టపాసులు కాల్చాలని చెబుతూ పిల్లలను విషపూరితమైన గాలితో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వారి గుండె, ఊపిరితిత్తులను నాశనం చేస్తోంది. ధనవంతులైన బీజేపీ నేతలు ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టుకుని నివసిస్తున్నారు. చీమ కుట్టినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించుకుంటున్నారు. మతం పేరుతో ప్రజల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. మీకు ఆపదొస్తే ఒక్క బీజేపీ నేత కూడా రారు" అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Updated Date - 2023-11-13T18:36:15+05:30 IST