Uttar Pradesh: 80 సీట్లు మావేనన్న బీజేపీ, అన్నీ ఓడిపోతారన్న అఖిలేష్
ABN , First Publish Date - 2023-01-23T14:36:28+05:30 IST
వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలపై అప్పుడే ప్రధాన పార్టీలన్నీ కసరత్తు మొదలుపెట్టాయి. విజయం తమదంటే తమదంటూ...
లక్నో: వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల (General Elections)పై అప్పుడే ప్రధాన పార్టీలన్నీ కసరత్తు మొదలుపెట్టాయి. విజయం తమదంటే తమదంటూ ప్రకటించుకుంటున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ఉత్తరప్రదేశ్ (Uttar pradesh)లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీకి సహజంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. దీంతో యూపీలో రాజకీయ వేడి మొదలైంది. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లను తాము గెలుచుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి తాజాగా ప్రకటించారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ తిరిగి ఎన్నికవుతారనీ, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లు గెలుచుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంత సీను లేదన్న అఖిలేష్
బీజేపీ నేత భూపేంద్ర చౌదరి చేసిన వాదనను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కొట్టివేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని అన్ని (80) పార్లమెంటు స్థానాలను కోల్పోనుందని చెప్పారు. రాబోయే 50 ఏళ్లు తామే పరిపాలిస్తామని చెప్పుకుంటున్న బీజేపీ ఇప్పుడు రోజులు లెక్కపెట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇక్కడి రెండు వైద్యకళాశాలను సందర్శిస్తే ఎన్ని సీట్లు వాళ్లకు వస్తాయో అవగతమవుతుందన్నారు. ఇటీవల జరిగిన మెయిన్‌పురి లోక్‌సభ, కతౌలి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిని పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. 2019లో ఎస్‌పీ-బీఎస్‌పీ కూటమి బరిలోకి దిగినప్పటికీ బీజేపీ 64 సీట్లు సాధించింది.