Bihar jail: ఆ ఖైదీ అంత పని చేస్తాడని ఊహించి ఉంటే.. కానిస్టేబుల్ అటువైపే వెళ్లేవాడు కాదేమో!

ABN , First Publish Date - 2023-02-19T19:17:16+05:30 IST

శనివారం రాత్రి ఆసుపత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు నొప్పికి గల కారణం తెలుసుకుందామని ఎక్స్-రే తీశారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది

Bihar jail: ఆ ఖైదీ అంత పని చేస్తాడని ఊహించి ఉంటే.. కానిస్టేబుల్ అటువైపే వెళ్లేవాడు కాదేమో!

పాట్నా: జైలులో కానిస్టేబుల్ తనిఖీ చేస్తుండడంతో గతుక్కుమన్న ఆ ఖైదీ మొబైల్ ఫోన్‌(Mobile Phone)తో దొరికిపోతానన్న భయంతో దానిని అమాంతం మింగేశాడు. ఆ తర్వాత తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న అతడిని సదర్ ఆసుపత్రి(Sadar Hospital)కి తరలించారు. అక్కడ అతడిని పరీక్షంచిన వైద్యులు అతడి పొట్టలో ఫోన్ ఉన్నట్టు గుర్తించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బీహార్‌(Bihar)లోని గోపాల్‌గంజ్(Gopalganj) డివిజినల్ జైలులో జరిగిందీ ఘటన.

కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆ ఖైదీ పేరు కైషర్ అలీ. శనివారం రాత్రి ఆసుపత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు నొప్పికి గల కారణం తెలుసుకుందామని ఎక్స్-రే తీశారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. కానిస్టేబుల్ ఒకరు జైలులో తనిఖీలు నిర్వహిస్తుండడంతో తన వద్దకు కూడా రావడం ఖాయమని భావించిన కైషర్ అలీ.. తన వద్ద ఫోన్ ఉన్న విషయం బయటపడిపోతుందని భయపడ్డాడు. అనుకున్నట్టే కానిస్టేబుల్ తన వైపుగా రావడంతో క్షణం కూడా ఆలోచించకుండా తన వద్ద ఉన్న మొబైల్‌ను అమాంతం మింగేశాడు. అయితే, ఆ వెంటనే కడుపులో నొప్పి బాధించడంతో విలవిల్లాడిపోయాడు.

దీంతో పోలీసులు కైషర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి అక్కడ చికిత్స కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. సమీప గ్రామానికి చెందిన కైషర్ అలీ మూడేళ్లుగా జైలులో ఉంటున్నట్టు చెప్పారు. 17 జనవరి 2020లో హజియాపూర్‌లో మత్తు పదార్థాలతో అతడు పట్టుబడ్డాడు. అప్పటి నుంచి జైలులోనే ఉంటున్నాడు.

Updated Date - 2023-02-19T19:17:17+05:30 IST