Share News

Ayodhya Deepotsav: గిన్నిస్ రికార్డులో దీపోత్సవ్.. సరయు నదికి యోగి 'హారతి'

ABN , First Publish Date - 2023-11-11T21:15:22+05:30 IST

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకకాలంలో రికార్డు స్థాయిలో దీపాలు వెలిగించడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం శనివారంనాడు సరికొత్త గిన్నెస్ ప్రపంచ రికార్డు ను సృష్టించింది. సొంత రికార్డును తిరగరాస్తూ సరయూ తీరంలోని 51 ఘాట్‌లలో 22.23 లక్షల దీపాలు ఏకకాలంలో వెలిగించారు.

Ayodhya Deepotsav: గిన్నిస్ రికార్డులో దీపోత్సవ్.. సరయు నదికి యోగి 'హారతి'

అయోధ్య: దీపావళి (Diwali) పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకకాలంలో రికార్డు స్థాయిలో దీపాలు (Diyas) వెలిగించడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya) నగరం శనివారంనాడు సరికొత్త గిన్నెస్ ప్రపంచ రికార్డు (Guinness World Record)ను సృష్టించింది. సొంత రికార్డును తిరగరాస్తూ సరయూ తీరంలోని 51 ఘాట్‌లలో 22.23 లక్షల దీపాలు ఏకకాలంలో వెలిగించారు. దీంతో ఘాట్‌లన్నీ దివ్వెల కాంతులతో ధగధగా మెరిసిపోయాయి.


యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2017లో అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో దీపోత్సవ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఆ ఏడాది 51,000 దీపాలు వెలిగించగా, 2019లో 4.10 లక్షల దీపాలు వెలిగించి రికార్డు నెలకొల్పారు. 2020లో 6 లక్షలకు పైగా దివ్వెలు వెలిగించగా, 2021లో 9 లక్షల దీపాలు వెలిగించారు. 2022లో 17 లక్షలకు పైగా దివ్వెలు వెలిగించి గిన్నెస్ రికార్డును యూపీ సర్కార్ దక్కించుకుంది. గత ఏడాది రికార్డును ఈసారి మళ్లీ తిరగరాస్తూ 22.23 లక్షల దీపాలను వెలిగించింది.


సరయూ నదికి యోగ మహా హారతి..

దీపోత్సవ్‌లో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరయూ ఘాట్ వద్ద 'హారతి' ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు అయోధ్య ఈవెంట్‌లో గవర్నర్ ఆనంది బెన్ పటేల్ పాల్గొన్నారు. దీనికి ముందు రామ్ కథా పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో రాముడు, సీత, లక్ష్మణ వేషధారులను సీఎం ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. రామాయణం థీమ్‌తో 18 అలంకరించిన శకటాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. రామచరితమానస్, వివిధ సామాజిక అంశాలైన మానవ హక్కులు, కనీస విద్య, మహిళా భద్రత, సంక్షేమ వంటి అంశాలను ప్రతిబింబించే కళారూపాలను ప్రదర్శించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది దిపోత్సవ్, దీపావళి సంబరాలు మరింత ప్రాధాన్యతను సంతరించకున్నాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రారంభోత్సవం 2024 జనవరి 22న జరుగనుండగా, ప్రధానమంత్రి మోదీ పాల్గొననున్నారు.

Updated Date - 2023-11-11T21:15:24+05:30 IST