Arunachal Pradesh : చైనాకు దీటుగా బదులిచ్చిన భారత్

ABN , First Publish Date - 2023-04-11T21:10:49+05:30 IST

అరుణాచల్ ప్రదేశ్ గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో భారత దేశంలో అంతర్భాగమని, విడదీయలేనటువంటిదని భారత ప్రభుత్వం

Arunachal Pradesh : చైనాకు దీటుగా బదులిచ్చిన భారత్
Amit Shah in Arunachal Pradesh

న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో భారత దేశంలో అంతర్భాగమని, విడదీయలేనటువంటిదని భారత ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. ఈ రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union home minister Amit Shah) పర్యటనపై చైనా అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి (Arindam Bagchi) ఓ ప్రకటనను విడుదల చేశారు.

హోం మంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడంపై అభ్యంతరాలు సహేతుకం కాదని, ఈ రాష్ట్రం భారత దేశంలో విడదీయలేని, అంతర్భాగమనే వాస్తవాన్ని ఈ అభ్యంతరాలు మార్చలేవని ఈ ప్రకటనలో చెప్పారు. చైనా అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. భారత దేశ నేతలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా పర్యటిస్తూ ఉంటారని తెలిపారు.

అమిత్ షా పర్యటనపై చైనా సోమవారం స్పందిస్తూ, చైనా ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ఈ పర్యటన ఉల్లంఘించినట్లు ఆరోపించింది. సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలకు ఇది ప్రోత్సాహకరంగా లేదని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌ (Zangnan) అని చైనా చెప్తోంది. అది టిబెట్ అటానమస్ రీజియన్‌లో భాగమని చెప్తోంది. ఇక్కడికి భారతీయ నేతలు పర్యటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ ఈ ప్రకటన చేశారు.

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు పేర్లను మార్చినట్లు చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమిత్ షా ఈ రాష్ట్రంలో పర్యటించి, భారత దేశ ప్రాదేశిక సమగ్రతపై ఇతరుల చెడు దృష్టి పడదని, అంతటి సాహసం ఎవరూ చేయలేరని చెప్పారు. మన భూభాగంలోని కనీసం ఒక అంగుళాన్ని అయినా ఆక్రమించలేరని చెప్పారు. భారత దేశ సరిహద్దుల్లోని భూభాగాలను ఆక్రమించుకునే రోజులు పోయాయని స్పష్టం చేశారు.

2017లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, 2018లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించినపుడు కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి :

Arvind Kejriwal : జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండండి : కేజ్రీవాల్

BJP Vs Congress : సోనియా గాంధీ వ్యాసంపై బీజేపీ ఆగ్రహం

Updated Date - 2023-04-11T21:10:49+05:30 IST