Karnataka Govt : ముగిసిన కేబినెట్ భేటీ.. ఇచ్చిన హామీల అమలు ఎప్పట్నుంచో తేదీలతో సహా ప్రకటించిన సిద్ధరామయ్య

ABN , First Publish Date - 2023-06-02T20:33:30+05:30 IST

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఐదు పథకాలు ఈ ఏడాదిలోనే అమలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించింది. పథకాల అమలు తేదీలతో సహా ప్రకటించారు..

Karnataka Govt : ముగిసిన కేబినెట్ భేటీ.. ఇచ్చిన హామీల అమలు ఎప్పట్నుంచో తేదీలతో సహా ప్రకటించిన సిద్ధరామయ్య

బెంగళూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఐదు పథకాలు ఈ ఏడాదిలోనే అమలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించింది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య పథకాల అమలును మీడియాలో సమావేశంలో ప్రకటించారు. పథకాల అమలు, తేదీలతో సహా ప్రకటించారు. సీఎం సిద్ధరామయ్య ప్రటకనపై కర్ణాటక ప్రజలు హర్షవ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన 5 హామీల అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగిందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే హామీలను అమలు చేసేందుకు నిర్ణయించామని చెప్పారు. గృహజ్యోతి, గృహలక్ష్మి, అన్నభాగ్య, యువనిధి, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటి ప్రజలకు ఇచ్చిన 5 ముఖ్యమైన హామీలను త్వరలో ప్రారభిస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

‘‘గృహజ్యోతి’’ పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా 200 యూనిట్ల కరెంట్, ‘‘గృహలక్ష్మి’’ పథకం కింది ప్రతి మహిళకు నెలకు రూ.2వేలు, ‘‘యువనిధి’’ పథకం కింద నిరుద్యోగులకు 18-25 సంవత్సరాల్లోపు పట్టభద్రులకు నెలకు రూ.3వేలు, డిప్లామా నిరుద్యోగులకు రూ.1500 నిరుద్యోగ భృతిని రెండేళ్లపాటు అందిస్తామని తెలిపారు. ‘‘అన్నభాగ్య’’ స్కీం కింది పేద కుటుంబాల్లోని ప్రతి మనిషికి 10 కిలోల బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు. ‘‘శక్తి స్కీం’’ కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

ఎన్నికల హామీల్లో మొదటిది గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్తు పూర్తి ఉచితంగా ఇస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అయితే ఇంతవరకు బిల్లులు చెల్లించని వినియోగదారులు జూలైలో చెల్లించాల్సి ఉంటుందని సిద్ధరామయ్య తెలిపారు.

రెండో హామీ గృహలక్ష్మి స్కీం కింద కుటుంబంలో మహిళకు నెలకు రూ.2వేల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ఆగస్టు15 నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని చెప్పారు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు ఆధార్ కార్డు, బ్యాంకు ఎకౌంట్ వివరాలు సమర్పించి తమ పేరును నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు. జూన్‌15 నుంచి ఆధార్ కార్డుతో దరఖాస్తు దాఖలు చేయాలని, జూలై 15 నుంచి ఆగస్టు15 వరకు బ్యాంకు ఖాతాలను వెరిఫై చేసుకోవాలని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

మూడో హామీ యువనిధి పథకం కింద నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 3వేల చొప్పున అందిస్తామని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. డిప్లమా హోల్డర్స్‌కు నెలకు రూ.1500 చొప్పున నిరుద్యోగ జీవనభృతి అందజేస్తామన్నారు. ఈ పథకం ట్రాన్స్‌జెండర్లకు కూడా వర్తిస్తుందని సిద్ధరామయ్య తెలిపారు.

నాలుగో హామీ అన్నభాగ్య పథకాన్ని జూలై 1నుంచి అమలు చేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అన్నభాగ్య పథకం కింది ప్రతి పేద కుటుంబంలోని మనిషికి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.

ఐదో హామీ శక్తి స్కీం కింద మహిళ ఆర్టీసీ బస్సుల్లో పూర్తి ఉచిత ప్రయాణం కల్పిస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఏసీ బస్సులు, స్లీపర్ బస్సులు, రాజహంస బస్సులు మినహా అన్ని BMTC and KSRTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. జూన్ 11 నుంచి ఈ స్కీం అమలులోకి వస్తుందని అన్నారు. బస్సుల్లో 50 శాతం సీట్లు మహిళలకు , 50 శాతం సీట్లు పురుషులకు రిజర్వుడ్ చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య అన్నారు.

Updated Date - 2023-06-02T20:58:36+05:30 IST