Putin: శత్రువులను వదిలిపెట్టం.. రష్యాకు అణుబాంబుల ముప్పు నేపథ్యంలో పుతిన్ గట్టి వార్నింగ్

ABN , First Publish Date - 2023-10-06T10:44:01+05:30 IST

రష్యాపై అణుదాడులు(Nuclear Attack) చేయాలనుకుంటున్న ఏ ఒక్క శత్రు దేశాన్ని విడిచిపెట్టేది లేదని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్( Vladimir Putin) స్పష్టం చేశారు. రాజధాని మాస్కోకు అణుదాడి హెచ్చరికల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Putin: శత్రువులను వదిలిపెట్టం.. రష్యాకు అణుబాంబుల ముప్పు నేపథ్యంలో పుతిన్ గట్టి వార్నింగ్

మాస్కో: రష్యాపై అణుదాడులు(Nuclear Attack) చేయాలనుకుంటున్న ఏ ఒక్క శత్రు దేశాన్ని విడిచిపెట్టేది లేదని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్( Vladimir Putin) స్పష్టం చేశారు. రాజధాని మాస్కోకు అణుదాడి హెచ్చరికల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణిని ఇప్పటికే పరీక్షించిందని.. తమ రక్షణ వ్యవస్థ సామర్థ్యం మరింత బలపడనుందని ఆయన పేర్కొన్నారు. రష్యా(Russia)లోని సోచిలో వాల్డై డిస్కషన్ క్లబ్ 20వ వార్షిక సమావేశంలో పుతిన్ ప్రసంగించారు. రష్యా అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి బ్యూరేవెస్ట్నిక్‌ను విజయవంతంగా పరీక్షించిందని పుతిన్ వెల్లడించారు.


దీంతో పాటు అణ్వాయుధాలలో మరో కీలకమైన సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థపై రిసర్చ్ చేయడం పూర్తయిందని అన్నారు. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌(Ukraine)పై దాడి ప్రారంభించినప్పటి నుంచి రష్యా అణ్వయుధ శక్తిని ప్రపంచానికి పదేపదే గుర్తు చేసిన పుతిన్.. తమకు వ్యతిరేకంగా పలు దేశాలు అణ్వాయుధాలను ప్రయోగిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి దాడులను గుర్తిస్తే.. తమ క్షిపణులు వందల సంఖ్యలో గాలిలో కనిపిస్తాయని.. ఒక్క శత్రువు కూడా మనుగడ సాగించే అవకాశమే ఉండదని తీవ్రంగా హెచ్చరించారు. అణు పరీక్షలను నిషేధించే ఒప్పందాన్ని అమెరికా ఆమోదించలేదని, రష్యా మాత్రమే ఆమోదించిందని పుతిన్ పేర్కొన్నారు. రష్యా పార్లమెంటు డూమా తన ఆమోదాన్ని ఉపసంహరించుకోవడం సిద్ధాంతపరంగా సాధ్యమవుతుందని అన్నారు. 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రష్యా, అమెరికా(America) లేదా రెండు దేశాలు అణు పరీక్షలను పునఃప్రారంభించడం అస్థిరతకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Updated Date - 2023-10-06T10:44:50+05:30 IST