Turkey On Kashmir: భారత్ హెచ్చరించినా మారని టర్కీ వక్రబుద్ధి.. యూఎన్‌లో మరోసారి కశ్మీర్ అంశం లేనెత్తిన అధ్యక్షుడు

ABN , First Publish Date - 2023-09-20T18:35:09+05:30 IST

కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దని గతంలో భారత్ హెచ్చరించినా.. టర్కీ మాత్రం తన వక్రబుద్ధి మార్చుకోలేదు. తన మిత్రదేశమైన పాకిస్తాన్‌కు మరోసారి వత్తాసు పలుకుతూ..

Turkey On Kashmir: భారత్ హెచ్చరించినా మారని టర్కీ వక్రబుద్ధి.. యూఎన్‌లో మరోసారి కశ్మీర్ అంశం లేనెత్తిన అధ్యక్షుడు

కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దని గతంలో భారత్ హెచ్చరించినా.. టర్కీ మాత్రం తన వక్రబుద్ధి మార్చుకోలేదు. తన మిత్రదేశమైన పాకిస్తాన్‌కు మరోసారి వత్తాసు పలుకుతూ.. ఐక్యరాజ్య సమితిలో టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ కశ్మీర్ అంశాన్ని లేనెత్తారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్‌లోని అత్యున్నత స్థాయి 78వ సెషన్‌లో ఎర్డోగాన్ ప్రసంగిస్తూ.. భారత్, పాక్ మధ్య ఇప్పటికీ కొనసాగుతున్న కశ్మీర్ వివాదం, దక్షిణాసియా ఉద్రిక్తతలకు కారణమైందని కుండబద్దలు కొట్టారు.

దక్షిణాసియాలో ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం మార్గం సుగమం అవ్వాలంటే.. భారత్, పాకిస్తాన్ మధ్య సంభాషణలు, పరస్పర సహకారాలతో శాశ్వతమైన శాంతిని నెలకొల్పాలని ఎర్డోగాన్ అన్నారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలకు తమ టర్కీ దేశం మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. భారత్, పాకిస్తాన్‌లకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఆ రెండు దేశాల మధ్య శాంతి నెలకొనకపోవడం దురదృష్టకరమని చెప్పారు. కనీసం ఇప్పటికైనా కశ్మీర్‌లో న్యాయమైన, శాశ్వతమైన శాంతి & శ్రేయస్సు నెలకొల్పాలని తాము ఆశిస్తున్నామని చెప్పుకొచ్చారు.


జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీతో వాణిజ్యం, మౌలిక సదుపాయాల సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిపిన వారం రోజుల తర్వాత ఎర్డోగాన్ కశ్మీర్ అంశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే.. యూఎన్ భద్రతా మండలిలో భారత్ పోషించిన పాత్ర గర్వించదగిన విషయమని కొనియాడారు. అలాగే.. యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత దేశాల సంఖ్యని పెంచాలని కోరారు. భద్రతా మండలిలో ఉన్న ఇతర 15 దేశాలను కూడా విడతలవారీగా శాశ్వత సభ్యుల్ని చేయాలని కోరారు. యూఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యాల కంటే ప్రపంచం పెద్దదని అన్నారు.

ఇదిలావుండగా.. కశ్మీర్ అంశాన్ని టర్కీ యూఎన్‌లో లేవనెత్తడం ఇదే మొదటిసారి కాదు. 2020లో జనరల్ డిబేట్‌లో భాగంగా ముందుగానే రికార్డ్ చేసిన వీడియోలో ఎర్డోగాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. అప్పుడు భారత్ ఇది ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. టర్కీ ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలని సూచించింది. అలాగే.. తమ సొంత విధానాలపై దృష్టి సారించుకుంటూ మంచిదని సలహా ఇచ్చింది.

Updated Date - 2023-09-20T18:35:09+05:30 IST