G20 Summit: పుతిన్, జిన్‌పింగ్ బాటలోనే మరో నేత.. జీ20 సమావేశాలకు డుమ్మా.. ఎవరు, ఎందుకు?

ABN , First Publish Date - 2023-09-08T17:59:27+05:30 IST

రేపటి నుంచి ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో...

G20 Summit: పుతిన్, జిన్‌పింగ్ బాటలోనే మరో నేత.. జీ20 సమావేశాలకు డుమ్మా.. ఎవరు, ఎందుకు?

రేపటి నుంచి ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా పుతిన్ డుమ్మా కొడితే, ఏ కారణం లేకుండానే జిన్‌పింగ్ ఈ సదస్సుకు రావడం లేదు. ఇప్పుడు వీరిద్దరి బాటలోనే మరో నేత కూడా ఈ సమ్మిట్‌కి రావడం లేదు. అతను మరెవ్వరో కాదు.. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్. నిజానికి.. ఈ సదస్సుకు రావడం కోసం ఆయన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. కానీ.. అనుకోకుండా చివరి నిమిషంలో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఇందుకు కారణం.. ఆయన కొవిడ్-19 బారిన పడటమే!


భారతదేశానికి బయలుదేరడానికి ముందు తనకు కాస్త అనారోగ్యంగా అనిపించడంతో.. పెడ్రో శాంచెజ్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకున్నారు. అప్పుడే ఆయనకు కొవిడ్-19 సోకినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో.. పెడ్రో తన పర్యటనని రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ మాధ్యమంగా వెల్లడించారు. ‘‘గురువారం మధ్యాహ్నం నేను టెస్ట్ చేయించుకోగా.. కొవిడ్ పాజిటివ్‌గా రిజల్ట్ వచ్చింది. దీంతో.. న్యూ ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాలకు నేను అందుబాటులో ఉండను. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ సమావేశాల్లో స్పెయిన్ తరఫున మొదటి ఉపాధ్యక్షుడు నాడియా క్వాలినో, ఆర్థిక వ్యవహారాల మంత్రితో పాటు విదేశాంగ మంత్రి మాన్యుయెల్ అల్బరేస్ ప్రాతినిధ్యం వహిస్తారు’’ అంటూ ట్విటర్‌లో పెడ్రో శాంచెజ్ రాసుకొచ్చారు. అలాగే.. యూరోపియన్ యూనియన్ సహకారం కూడా ఉంటుందని తెలిపారు.

కాగా.. సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ20 శిఖరాగ్ర సమావేశాలు ఢిల్లీలో జరగనున్నాయి. ఈ సదస్సుకు యూరోపియన్ యూనియన్ నుండి 30 మందికి పైగా దేశాధినేతలు, ఉన్నతాధికారులు.. 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. మరోవైపు.. ఈ సమ్మిట్‌లో పాల్గొనడం కోసం ప్రపంచ దేశాల అధినేతలు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు. తొలుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మధ్యాహ్నం 1:40 గంటలకు ఢిల్లీకి చేరుకోగా.. కేంద్ర సహాయమంత్రి అశ్వినీ కుమార్ ఆయనకు సాదర స్వాగతం పలికారు.

Updated Date - 2023-09-08T17:59:27+05:30 IST