South Korea : ‘పెళ్లి’ అంటే చాలు జడుసుకుంటున్న దక్షిణ కొరియా యువత

ABN , First Publish Date - 2023-03-16T16:02:57+05:30 IST

దక్షిణ కొరియాలో పెళ్లిళ్ల సంఖ్య రికార్డు స్థాయికి పతనమైంది. ఈ దేశంలో జననాల రేటు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉంటోంది.

South Korea : ‘పెళ్లి’ అంటే చాలు జడుసుకుంటున్న దక్షిణ కొరియా యువత
South Koreans

సియోల్ : దక్షిణ కొరియాలో పెళ్లిళ్ల సంఖ్య రికార్డు స్థాయికి పతనమైంది. ఈ దేశంలో జననాల రేటు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉంటోంది. దీంతో జనాభా స్వరూపం మారిపోతోందని దక్షిణ కొరియన్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖర్చులు పెరగడం, ఉద్యోగాలు చేసే మహిళలు ఇంటి పనుల భారాన్ని మోయలేకపోతుండటం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు నిపుణులు చెప్తున్నారు.

2022లో 1,92,000 జంటలు పెళ్లి చేసుకున్నట్లు గురువారం విడుదలైన స్టాటిస్టిక్స్ కొరియా నివేదిక వెల్లడించింది. 2012లో జరిగిన వివాహాలతో పోల్చుకుంటే, 2022లో 40 శాతం పెళ్లిళ్లు తగ్గిపోయాయి. 2012లో 3,27,000 జంటలు వివాహ బంధాన్ని ఏర్పరచుకున్నాయి. దక్షిణ కొరియా ప్రభుత్వం పెళ్లిళ్లను రికార్డు చేయడం 1970 నుంచి ప్రారంభించింది. అప్పటి నుంచి చూసినపుడు 2022లో అతి తక్కువ పెళ్లిళ్లు జరిగినట్లు వెల్లడైంది.

పెళ్లి చేసుకునే పురుషుల సగటు వయసు 33.7 సంవత్సరాలని తేలింది. అదేవిధంగా, వివాహం చేసుకునే స్త్రీల సగటు వయసు 31.3 సంవత్సరాలని వెల్లడైంది. ఓ దశాబ్దం క్రితం కన్నా పురుషులు సగటున 1.6 సంవత్సరాలు ఆలస్యంగా, స్త్రీలు 1.9 సంవత్సరాలు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. గత ఏడాది పెళ్లి చేసుకున్న జంటల్లో దాదాపు 80 శాతం మందికి అది వారి తొలి వివాహం.

దక్షిణ కొరియాలో జననాల రేటు (Birth Rate) కూడా చాలా తక్కువగా ఉంది. గత ఏడాది కేవలం 2,49,000 మంది బిడ్డలు మాత్రమే జన్మించారు. జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం 2006 నుంచి 213 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. అయినప్పటికీ 2067నాటికి దేశ జనాభా 5 కోట్ల 20 లక్షల నుంచి 3 కోట్ల 90 లక్షలకు తగ్గిపోతుందని అంచనా. అప్పటికి జనాభా సగటు వయసు 62 సంవత్సరాలు ఉంటుందని గణాంకాలు చెప్తున్నాయి.

పెళ్లిళ్లు, జననాలు తగ్గడానికి కారణాలు చాలా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. పిల్లల పెంపకానికి ఖర్చులు విపరీతంగా ఉండటం, ఇళ్ల అద్దెలు భరించలేనంతగా ఉండటం, మంచి జీతం వచ్చే ఉద్యోగాలను సంపాదించుకోవడం కష్టంగా మారడం, సమాజంలో పోటీతత్వం పెరగడం వంటి కారణాల వల్ల యువత పెళ్లి చేసుకోవడంపట్ల ఆసక్తి చూపడం లేదని చెప్తున్నారు. మరోవైపు మహిళలు ఓ వైపు ఇంటి పనులు చేసుకుంటూ, మరోవైపు తమ కెరీర్‌ను నిర్వహించుకోవడం కష్టంగా మారడం కూడా దీనికి కారణమని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Nobel Peace Prize : మోదీకి నోబెల్ శాంతి బహుమతి... నోబెల్ ప్రైజ్ కమిటీ నేత సంచలన వ్యాఖ్యలు...

BJP Vs Congress : రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బ్లాస్టింగ్ కామెంట్స్

Updated Date - 2023-03-16T16:02:57+05:30 IST