Share News

Hawaii Pond: అమెరికాలో వింత ఘటన.. గులాబీ రంగులోకి మారిన చెరువు.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2023-11-13T15:29:11+05:30 IST

Kealia Pond: మన భూ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు ఉన్నాయి. అందుకే.. అప్పుడప్పుడు ఎవ్వరూ ఊహించని పరిణామాలు వెలుగు చూస్తుంటాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. అమెరికాలో చోటు చేసుకున్న తాజా పరిణామం. హవాయిలో ఉన్న ఒక చెరువు.. ఉన్నట్లుండి ఒక్కసారిగా బబుల్-గమ్ పింక్‌ రంగులోకి మారిపోయింది.

Hawaii Pond: అమెరికాలో వింత ఘటన.. గులాబీ రంగులోకి మారిన చెరువు.. ఎందుకో తెలుసా?

మన భూ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు ఉన్నాయి. అందుకే.. అప్పుడప్పుడు ఎవ్వరూ ఊహించని పరిణామాలు వెలుగు చూస్తుంటాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. అమెరికాలో చోటు చేసుకున్న తాజా పరిణామం. హవాయిలో ఉన్న ఒక చెరువు.. ఉన్నట్లుండి ఒక్కసారిగా బబుల్-గమ్ పింక్‌ రంగులోకి మారిపోయింది. ఈ వింత దృగ్విషయాన్ని చూసి.. పర్యాటకులతో పాటు స్థానికులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా ఇలా లీక్ అవ్వడమే ఆలస్యం.. జనాలు ఆ చెరువు వద్దకు పరుగులు తీస్తున్నారు. ఆ అద్భుత దృశ్యాన్ని (చెరువు) కనులారా వీక్షించేందుకు.. ఆ ప్రాంతానికి ఎగబడుతున్నారు.

మౌయిలో ఉండే ఈ కెలియా చెరువులోని నీళ్లు గులాంటి రంగులోకి మారడాన్ని తాము మొదటిసారి అక్టోబర్ 30వ తేదీన గమనించారని, గతంలో తామెప్పుడూ ఇలాంటిది చూడలేదని.. జాతీయ వన్యప్రాణుల ఆశ్రయానికి చెందిన కొందరు వాలంటీర్లు పేర్కొన్నారు. ఈ ఆశ్రయ నిర్వాహకుడు బ్రెట్ వోల్ఫ్ మాట్లాడుతూ.. చెరువు వద్ద నడుస్తున్న ఓ వ్యక్తి తనకు ఈ విషయాన్ని తెలియజేశాడని అన్నాడు. ఇక్కడేదో విచిత్రం జరుగుతోందని ఆ వ్యక్తి తనకు చెప్పడంతో.. వెంటనే చెరువు వద్దకు వెళ్లి చూశానన్నాడు. చెరువులోని నీళ్లు ఇలా గులాబీ రంగులోకి మారడాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నాడు. ఇలాంటి పరిణామాన్ని తానూ మునుపెన్నడూ చూడలేదని చెప్పుకొచ్చాడు.


అయితే.. ఈ నీళ్లు ఇలా గులాబీ రంగులోకి మారడానికి ఒక బ్యాక్టీరియా కారణమని బ్రెట్ వోల్ఫ్ తెలిపాడు. దాని పేరు హలోబ్యాక్టీరియా అని, ఇది ఏకకణ జీవి అని, దాని పెరుగుదల కారణంగానే నీళ్లు ఇలా గులాబీ రంగులోకి మారాయన్నాడు. ఇవి అధిక లవణీయత పరిస్థితులలో వృద్ధి చెందుతాయన్నాడు. అయితే.. ఇది నిజమేనని ధృవీకరించేందుకు DNA పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పాడు. నిపుణులు సైతం.. హలోబ్యాక్టీరియానే కారణమని నమ్ముతున్నారు. నీటిపై ఆ బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల.. ఆ చెరువు నీళ్లు ఇలా బబుల్-గమ్ పింక్‌లోకి మారాయని పేర్కొంటున్నారు.

కాగా.. కెలియా చెరువులోని లవణీయత ప్రతి వెయ్యికి 70 % కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించబడింది. సముద్రపు నీటి లవణీయత కంటే రెండింతలు ఎక్కువ. కెలియా చెరువులో ఉండటంతో.. హలోబ్యాక్టీరియా జీవులకు ఇది అనువైన వాతావరణాన్ని అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు.. మౌయి ప్రాంతం కరువును ఎదుర్కొంటోంది, నీళ్ల రంగు మారేందుకు ఇది కూడా కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అయితే.. ఈ చెరువు గతంలోనూ కరువు, అధిక లవణీయతతో ఉండేదని, ఉన్నట్లుండి ఇప్పుడే నీళ్ల రంగు ఎందుకు మారిందో అంతుచిక్కడం లేదని వోల్ఫ్ వెల్లడించాడు. దీని వల్ల ఏదైనా హాని కలగొచ్చన్న అనుమానంతో.. నీటి నుంచి దూరం పాటించాలని, అలాగే జంతువులతో పాటు పక్షులను కూడా దూరంగా ఉంచాలని వోల్ఫ్ సూచించాడు. ఈ పరిస్థితికి గల కారణాలేంటో తెలుసుకోవడం కోసం.. US ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ పర్యవేక్షిస్తోంది.

Updated Date - 2023-11-13T15:29:13+05:30 IST