Israel-Hamas War: పాలస్తీనాకు భారత్ మద్దతు ఉంది.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం అంశంలో భారత్ జోక్యం చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-10-10T21:13:15+05:30 IST

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. భారత్‌లోని పాలస్తీనా రాయబారి అబు అల్‌హైజా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కాలం నుంచే...

Israel-Hamas War: పాలస్తీనాకు భారత్ మద్దతు ఉంది.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం అంశంలో భారత్ జోక్యం చేసుకోవాలి

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. భారత్‌లోని పాలస్తీనా రాయబారి అబు అల్‌హైజా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కాలం నుంచే పాలస్తీనాకు భారత్ మద్దతు ఉందని.. ఇజ్రాయెల్, పాలస్తీనాలకు భారత్ మిత్రదేశమని అన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న సంక్షోభాన్ని తగ్గించే సామర్థ్యం భారత్‌కి ఉందని అన్నారు. కాబట్టి.. ఈ విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

మంగళవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబు అల్‌హైజా మాట్లాడుతూ.. ‘‘పాలస్తీనా సమస్య గురించి మహాత్మా గాంధీ కాలం నుంచే భారత్‌కు తెలుసు. పాలస్తీనా ఆందోళనకు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు దేశాలకూ భారత్ మిత్రదేశం. కాబట్టి.. ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణాన్ని ఆపే సామర్థ్యం భారతదేశానికి ఉంది. ఈ అంశంలో భారత్ జోక్యం చేసుకుంటే, కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భారత్ ఎంతో ముఖ్యమైన దేశం’’ అని చెప్పుకొచ్చారు. పాలస్తీనా విషయంలో ఎన్నో ఏళ్లుగా స్పష్టమైన వైఖరి కలిగిన భారతదేశం.. పశ్చిమాసియా, అమెరికా, ఐరోపా సమాఖ్యతో సంప్రదింపులు జరపగలదని అన్నారు. ఫలితంగా.. శాంతివైపు నడిపించేందుకు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వ పాత్ర పోషించి, ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యని పరిష్కరించాలని తాము రెండేళ్ల క్రితమే భారత్‌ని కోరామని కూడా తెలిపారు.


ఈ యుద్ధానికి అంతర్జాతీయ సమాజందే బాధ్యతే అని అల్‌హైజా కుండబద్దలు కొట్టారు. పాలస్తీనాలపై ఐక్యరాజ్య సమితి 800 తీర్మానాలను ఆమోదించిందని.. కానీ ఇజ్రాయెల్‌పై మాత్రం ఏదీ అమలు చేయలేదని పేర్కొన్నారు. ఆక్రమిత భూభాగాలపై ఇజ్రాయెల్ తన నియంత్రణను ముగించినట్లైతే.. పాలస్తీనా దాడులు కూడా ముగుస్తాయన్నారు. ఎన్నో ఏళ్లుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతోన్న దుర్మార్గాలకు ప్రతీకారంగానే హమాస్ ఈ తరహా దాడులు చేసిందని ఆయన బాంబ్ పేల్చారు. అయితే.. పౌరుల హత్యలకు పాలస్తీనా వ్యతిరేకమని, శాంతియుతంగా ఈ సంక్షోభం పరిష్కారం కావాలని కోరుతున్నానన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం తమ అధ్యక్షుడు అనేక యూరోపియన్ దేశాలతో చర్చలు జరపడానికి సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. గాజాకు విద్యుత్, ఆహార సరఫరాను నిలిపివేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించిందని.. ఇది యుద్ధ చర్య అని మండిపడ్డారు.

Updated Date - 2023-10-10T21:13:15+05:30 IST