Heart Shutdown: కొవిడ్‌ తర్వాతే ఇలా ఎందుకు జరుగుతోంది!?

ABN , First Publish Date - 2023-02-27T12:17:47+05:30 IST

అప్పటిదాకా డ్యాన్స్‌ (Dance) చేస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోతాడు! రోజూ జిమ్‌కెళ్లి కసరత్తులు చేస్తూ ఆరోగ్యంగా ఉండే వ్యక్తి సైతం

Heart Shutdown: కొవిడ్‌ తర్వాతే ఇలా ఎందుకు జరుగుతోంది!?
ఎందుకు జరుగుతోంది!?

మానసిక, భావోద్వేగపరమైన ఒత్తిళ్లతో

ఆకస్మిక బ్లడ్‌ క్లాట్లు.. కార్డియాక్‌ అరెస్ట్‌లు

ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్న యువత

హృద్రోగాలు లేనివారిలోనూ సమస్యలు

కొవిడ్‌ తర్వాత పెరిగిన గుండె జబ్బులు

అర్ధరాత్రి దాటినా మొబైల్‌, టీవీ ముందే

ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న శరీరం

సరిగ్గా నిద్రపోనివారికి హృద్రోగాల ముప్పు

జీవనశైలి మార్చుకోవాలి: వైద్యనిపుణులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): అప్పటిదాకా డ్యాన్స్‌ (Dance) చేస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోతాడు! రోజూ జిమ్‌కెళ్లి కసరత్తులు చేస్తూ ఆరోగ్యంగా ఉండే వ్యక్తి సైతం అనూహ్యంగా గుండె ఆగి ప్రాణాలు కోల్పోతాడు! మాట్లాడుతూ మాట్లాడుతూనే.. స్విచ్‌ ఆఫ్‌ చేస్తే లైటు ఆగిపోయినట్లు.. కిందపడి ప్రాణాలు కోల్పోతారు ఇంకొకరు!! ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌ మహమ్మారి ఉధృతి తగ్గిపోయాక.. ఇలాంటి కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ తరహా కేసులు గతంలో 25 పడకల ఐసీయూ (ICU) కి రోజుకు 2 వరకూ వచ్చేవని.. ఇప్పుడు నాలుగైదు వరకు వస్తున్నాయని, మరికొందరు ఆస్పత్రికి రాకుండానే చనిపోతున్నారని వైద్యులు వివరించారు. అలాంటి కేసులు అసలు లెక్కల్లోకే రావట్లేదు. ఈ కేసుల్లో చాలావరకూ ‘ఇన్‌స్టంట్‌ బ్లడ్‌ క్లాట్లు’ ఉండడం గమనిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మానసిక, భావోద్వేగపరమైన ఒత్తిళ్ల వల్ల కూడా ఇలాంటి క్లాట్లు ఏర్పడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. నిర్మల్‌ జిల్లాలో పెళ్లి బారాత్‌లో ఆనందంగా డాన్స్‌ చేస్తూ కుప్పకూలిన 18 ఏళ్ల యువకుడి విషాదం ఇలాంటి కేసులకు తాజా ఉదాహరణ. అంతకు ముందు.. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఓ కానిస్టేబుల్‌ జిమ్‌ చేస్తూ.. కాసేపు సేద తీర్చుకుంటుండగా, కుప్పకూలిపోయాడు. రాజధానిలోనే మరో వ్యక్తి బస్టా్‌పలో సృహతప్పి పడిపోగా, కానిస్టేబుల్‌ సీపీఆర్‌ చేయడంతో ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయట పడ్డారు. కొవిడ్‌ తర్వాత ఈ తరహాలో 25 నుంచి 30 శాతం గుండె జబ్బులు, ఆకస్మిక మరణాలు చోటు చేసుకుంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ‘ఆకస్మిక బ్లడ్‌ క్లాట్‌’ కేసులు ఎక్కువగా వస్తున్నాయని.. అంటే, అప్పటివరకూ వారికి ఎలాంటి హృద్రోగాలూ లేకున్నా రక్తనాళాల్లో ఉన్నట్టుండి క్లాట్లు ఏర్పడి చనిపోతున్నారని ఒమేగా ఆస్పత్రి కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ గణేశ్‌ మాథన్‌ తెలిపారు. మానసిక ఒత్తిళ్లు, ఎమోషనల్‌ స్ట్రెస్‌ ఎక్కువ కావడం ఈ సమస్యకు ఒక కారణంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ గడ్డలకు (క్లాట్లు) రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులకు సంబంధం లేదని.. కొలెస్ట్రాల్‌ సమస్య లేని వ్యక్తులలో సైతం ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. మానసిక ఒత్తిళ్ల కారణంగా శరీరంలో జరిగే రసాయన మార్పుల వల్ల స్ట్రెస్‌ మరింత పెరిగి క్లాట్లకు దారి తీస్తుందని వివరిస్తున్నారు. అలాగే, కొన్నిసార్లు కొన్ని రకాల మందుల వాడకంవల్లా ఆకస్మాత్తుగా బ్లడ్‌ క్లాట్‌ అయ్యే ముప్పు ఉందని వెల్లడించారు.

heqe2.jpg

నిద్రలేమి.. ప్రమాదకరం

దేశంలో నెట్‌ విప్లవం వచ్చాక.. చాలామంది గంటల కొద్దీ సమయం మొబైల్‌, టీవీ స్ర్కీన్ల ముందే గడిపేస్తున్నారు. అర్ధరాత్రి దాటి.. తెల్లవారుజాము దాకా ఫోన్‌, టీవీ చూస్తూ ఉండిపోతున్నారు. దీనివల్ల హార్మోన్ల విడుదలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. మెదడుకు తగిన విశ్రాంతి లభించకపోవడంతో తెలియకుండానే గుండెపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ అలవాట్లు ఉన్నవారు చిన్న వయస్సులోనే హృద్రోగాల బారిన పడే ముప్పు ఉందని, వారు ప్రమాదం అంచున ఉన్నట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పడుకునే వేళలో పనిచేయడం, పనిచేసే సమయాల్లో పడుకోవడం వంటి జీవనశైలి వల్ల గుండె పనితీరు కూడా మారుతోందని.. జీవన చక్రానికి వ్యతిరేకంగా పని సమయాలు ఉండడం వల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా శరీరం ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటోందని వివరిస్తున్నారు.

haert.jpg

కుటుంబంలో ఎవరికైనా ఉంటే...

కుటుంబంలో ఎవరికైనా హృద్రోగాలు ఉంటే.. వారి పిల్లలకు కూడా త్వరగా వచ్చే అవకాశాలుంటాయి. చాలా మంది ధూమపానం, జంక్‌ఫుడ్‌ వంటివాటికి అలవాటుపడుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఆహారం తీసుకుంటున్నారు. నిద్ర సమయాలు తగ్గాయి. పనిలో టార్గెట్ల వల్ల ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. వ్యాయామం చేయట్లేదు. కూర్చుని పనిచేయడం వల్ల అధిక బరువు, బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి.. 30 ఏళ్లు దాటినవారు తొలుత బీపీ, కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవాలి. వాటిలో ఏవైనా తేడాలు ఉంటే జీవన శైలి మార్పులు చేసుకోవాలి. ధ్యానం చేయాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

- డాక్టర్‌ పీఎల్‌ఎన్‌ కపర్ది, సీనియర్‌ కార్డియాలజిస్టు, కేర్‌ ఆస్పత్రి

సీటీ యాంజియోగ్రామ్‌ పరీక్ష తప్పని సరి

టీఎంటీ (ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌), 2డీ ఎకో, లిపిడ్‌ ప్రోఫైల్‌, ఈసీజీ పరీక్షల వల్ల 50 శాతం మేరకు గుండె సమస్యలను ముందే గుర్తించవచ్చు. ధూమపానం, మద్యపానం అలవాట్లున్నవారు, బీపీ బాధితులు..35 ఏళ్ల వయస్సులోనే సీటీ యాంజియోగ్రామ్‌ చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. అందులో అంతా సజావుగా ఉన్నట్టు తేలితే.. వారికి కనీసం ఏడేళ్ల దాకా హృద్రోగాలు వచ్చే ముప్పు 99 శాతం ఉండదు. పిల్లలకు తల్లిదండ్రులు మంచి జీన్స్‌ ఇవ్వాలి. అందుకు ముందుగా తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. రోజూ కనీసం రెండు వేర్వేరు రకాల పండ్లు తినాలి. తప్పనిసరిగా ఒక కప్పు సలాడ్‌ తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారం 15 నిమిషాల్లో తింటే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. ఆలస్యమైతే పోషకాలు తగ్గిపోతాయి. మాంసాహార, స్పైసీ వంటకాలను మధ్యాహ్నానికి, కొంతమేరకు పరిమితం చేయాలి. రాత్రి పూట చపాతిలతోనే సరిపెట్టాలి. రాత్రిపూట స్పైసీ ఆహారం ఎక్కువగా తీసుకుంటే గుండె నొప్పి వచ్చే ముప్పు ఎక్కువ శాతం ఉంటుంది. కుదిరితే రోజూ నడక, పరుగు, చెమటలు పట్టేలా వ్యాయాయం చేయాలి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

- డాక్టర్‌ గణేష్‌ మాథన్‌, సీనియర్‌ ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజిస్టు,ఒమేగా ఆస్పత్రి

Updated Date - 2023-02-27T12:17:49+05:30 IST